శేర్లింగంపల్లి నియోజకవర్గంలోని పంచమి కాలనీలో డ్రైనేజీ నీరు రోడ్లపైకి పొంగిపొర్లడంతో స్థానికులు, వాహనదారులు ఎదుర్కొంటున్న ఇబ్బందులకు కాంగ్రెస్ నాయకుల చొరవతో తాత్కాలిక పరిష్కారం లభించింది.
ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని పంచమి కాలనీ మెయిన్ రోడ్డులో డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేకపోవడంతో నీరు రోడ్లపైకి చేరింది. దీంతో కాలనీ వాసులు, అటుగా వెళ్లే వాహనదారులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు.
సమస్యను తెలుసుకున్న కాంగ్రెస్ సీనియర్ నాయకులు జిల్లా గణేష్, వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. స్థానికుల నుంచి వివరాలు సేకరించి, సమస్య తీవ్రతను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.
జిల్లా గణేష్ సూచనల మేరకు, సంబంధిత అధికారులు మ్యాన్‌హోల్‌లో పేరుకుపోయిన సిల్ట్‌ను తొలగించే పనులు చేపట్టారు. ఈ చర్యలతో డ్రైనేజీ నీరు రోడ్లపైకి రాకుండా నివారించగలిగారు.
సమస్య సత్వర పరిష్కారానికి కృషి చేసిన కాంగ్రెస్ నాయకులకు, అధికారులకు స్థానికులు కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి సమస్యలు తలెత్తకుండా శాశ్వత పరిష్కారం చూపాలని కోరారు.











