సంగారెడ్డి జిల్లా ప్రతినిధి, జనవరి 07 (ప్రశ్న ఆయుధం న్యూస్): సంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్‌గా సమర్థవంతమైన సేవలందించి ప్రజల మన్ననలు పొందిన బి.చంద్రశేఖర్ నల్గొండ జిల్లా కలెక్టర్‌గా పదోన్నతిపై బదిలీ కావడంతో జిల్లా యంత్రాంగం ఆయనకు బుధవారం కలెక్టరేట్లోని ఆడిటోరియంలో ఆత్మీయ వీడ్కోలు సన్మాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బదిలీపై వెళ్తున్న జిల్లా యువజన క్రీడల అధికారి (డీవైఎస్ఓ) ఖాసీం బేగ్, జిల్లా అటవీ శాఖ అధికారి శ్రీధర్ రావులను కూడా ఘనంగా సన్మానించి వారి సేవలను కొనియాడారు. జిల్లా అభివృద్ధిలో వీరందరూ కీలక పాత్ర పోషించారని అధికారులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ.. చంద్రశేఖర్ గత రెండున్నర సంవత్సరాలుగా జిల్లా అదనపు కలెక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తూ సంగారెడ్డి జిల్లా అభివృద్ధికి విశేష సేవలందించారని ప్రశంసించారు. ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికలను పారదర్శకంగా, శాంతియుత వాతావరణంలో విజయవంతంగా నిర్వహించడంలో ఆయన పాత్ర అత్యంత కీలకమని తెలిపారు. ఎన్నికల ప్రక్రియలో అన్ని శాఖల అధికారులతో సమన్వయం సాధిస్తూ ప్రజాస్వామ్య వ్యవస్థ బలోపేతానికి కృషి చేశారని అన్నారు. అలాగే డీవైఎస్ఓ ఖాసీం బేగ్, అటవీ శాఖ అధికారి శ్రీధర్ రావు అందించిన సేవలు ప్రశంసనీయమని పేర్కొన్నారు. సన్మాన కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొని బదిలీపై వెళ్తున్న అధికారులకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పలువురు అధికారులు మాట్లాడుతూ.. బి.చంద్రశేఖర్ తన పరిపాలనా జీవితంలో క్రమశిక్షణ, సమన్వయం, ప్రజాప్రయోజనాల పట్ల నిబద్ధతకు ప్రతీకగా నిలిచారని ఈ సందర్భంగా పేర్కొన్నారు. సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించి తక్షణ నిర్ణయాలు తీసుకోవడం ఆయన ప్రత్యేకతగా గుర్తింపు పొందదారని అన్నారు. ఈ సందర్భంగా చంద్రశేఖర్ మాట్లాడుతూ ఈ జిల్లాతో తనకు ఎంతో అనుబంధం ఏర్పడిందని, ఎన్నో మధుర జ్ఞాపకాలు జిల్లాతో ముడిపడి ఉన్నాయని తెలిపారు. అన్ని శాఖల అధికారుల సహకారంతో జిల్లా ప్రజలకు సేవలందించగలిగానని, అధికారులతో కలిసి పనిచేస్తూ ఎంతో నేర్చుకున్నానని అన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్లు పాండు, మాధురి, సబ్ కలెక్టర్ ఉమా హారతి, జిల్లా అధికారులు, వివిధ శాఖల ఉద్యోగులు, వివిధ ఉద్యోగ సంఘాల ప్రతినిధులు, సిబ్బంది పాల్గొన్నారు.
నల్గొండ కలెక్టర్‌గా పదోన్నతిపై వెళ్లిన బి.చంద్రశేఖర్‌కు ఘనంగా ఆత్మీయ సత్కారం
Published On: January 7, 2026 9:35 pm