Site icon PRASHNA AYUDHAM

మత్స్యకారుల సంక్షేమానికి కాంగ్రెస్ కట్టుబడి ఉంది: నీలం మధు ముదిరాజ్

IMG 20251121 191306

Oplus_16908288

సంగారెడ్డి జిల్లా ప్రతినిధి, నవంబరు 21 (ప్రశ్న ఆయుధం న్యూస్): మత్స్యకారుల సంక్షేమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ నీలం మధు ముదిరాజ్ అన్నారు. శుక్రవారం ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం సందర్భంగా కొల్లాపూర్ నియోజకవర్గ కేంద్రంలోనీ రాజావారి బంగ్లా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన మహాసభ కార్యక్రమానికి మంత్రులు జూపల్లి కృష్ణారావు,వాకిటి శ్రీహరి, పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్, మల్లు రవిలతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రులు, నీలం మధు మాట్లాడుతూ.. మత్స్యకారుల దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించడానికి కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. త్వరలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సమావేశం ఏర్పాటు చేసి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన బీసీ కులగణన ద్వారా బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల చట్టం కోసం అసెంబ్లీలో తీర్మానం చేసినా విషయాన్ని గుర్తు చేశారు. కొందరు అడ్డంకులు సృష్టించి బీసీ రిజర్వేషన్ల ప్రక్రియను తాత్కాలికంగా అడ్డుకున్నారని కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం రిజర్వేషన్లు అమలు చేయడానికి న్యాయపోరాటం కొనసాగిస్తుందని స్పష్టం చేశారు. రాబోయే సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పక్షాన 42 శాతం టిక్కెట్లు బీసీలకు ఇచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ సంసిద్ధంగా ఉందన్నారు. చిరకాలంగా ముదిరాజుల డిమాండ్ అయిన బీసీ (డీ) నుంచి బీసీ (ఏ)లోకి చేర్చడానికి ప్రయత్నాలు కొనసాగుతున్నాయని వెల్లడించారు. 50 సంవత్సరాలు నిండిన మత్స్యకారులకు పెన్షన్ సౌకర్యం కల్పించాలని ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ దృష్టికి తీసుకుని పోవడం జరిగిందని పేర్కొన్నారు. త్వరలో అందరి పెద్దలతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ ను కలిసి మన డిమాండ్లను సాధించుకుందామని తెలిపారు. మన సంక్షేమం కృషి చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి మనమంతా మద్దతుగా నిలబడాల్సిన అవసరం ఉందన్నారు. వచ్చే స్థానిక ఎన్నికల్లో అందరూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు మద్దతు పలికి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సభాధ్యక్షుడు పెబ్బేటి మల్లికార్జున్, కాంగ్రెస్ నాయకులు పగిడాల శ్రీనివాసులు, మాజీ ఎంపీపీ భయ్యా వెంకటస్వామి, నాయకులు సుంకరబోయిన మహేష్, వాకిటి ఆంజనేయులు, చెన్న రాములు, కృష్ణయ్య, కేతురి వెంకటేష్, గాలెన్న, స్థానిక ప్రజాప్రతినిధులు, జిల్లా మత్స్యకారుల సంఘాలు, వేలాది మత్స్యకారులు తదితరులు పాల్గొన్నారు.

Exit mobile version