సంగారెడ్డి ప్రతినిధి, సెప్టెంబర్ 26 (ప్రశ్న ఆయుధం): భారీ వర్షాల కారణంగా కంది మండలం కౌలంపేట్ గ్రామం ఊదం చెరువులో నీటి మట్టం ప్రమాదకర స్థాయికి చేరుకుంది. ఏ క్షణాన చెరువు కట్ట కోతకు గురవుతుందనని, ప్రస్తుతం ఆ చెరువు కట్ట ఎప్పుడు తెగిపోతుందోనని ఉక్కిరి బిక్కిరి మంటూ గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. భారీ వర్షాలు కురుస్తుండటంతో చెరువులో నీరు ప్రమాదకర స్థాయికి చేరుకుంది. పరిమితికి మించి నిండితే ఆ నీటిని కిందకి వదిలేయాలి. కానీ ఇక్కడ నేషనల్ హైవే విస్తరణలో భాగంగా ఊదం చెరువులో నుండి నీరు బయటకు రావలసిన నాలాల దారులన్నింటినీ కంకర మట్టి వేసి జేసీబీలతో పూడ్చివేశారు. దీంతో గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు చెరువు నిండిపోయింది. అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే, చెరువు కట్ట తెగిపోయే పరిస్థితి ఏర్పడుతుందని, ఇప్పటికైనా అధికారులు స్పందించి చెరువులో నుండి నీరు బయటకు వెళ్లే విధంగా చేయాలని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
*గ్రామ కార్యదర్శి వివరణ:*
భారీ వర్షాలు కురుస్తున్నందున కౌలంపేట ఊదం చెరువు నిండిన మాట వాస్తవమే.. ఈ విషయమై ఇరిగేషన్ అధికారులకు సమాచారం ఇచ్చానని, సాయంత్రం మూడు గంటల వరకు జెసిబి పంపించి మూసి వేసిన నాలాను మళ్లీ పూడిక తీసి నీళ్ళు పోయే విధంగా చేస్తామని చెప్పారు కానీ ఇంత వరకు రాలేదని సమాధానం ఇచ్చాడు.