చిట్టీల పేరుతో ప్రజల నుంచి డిపాజిట్లు సేకరించి, వాటిని తిరిగి చెల్లించకుండా మోసాలకు పాల్పడిన అక్షర చిట్‌ఫండ్స్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ పేరాల శ్రీనివాసరావును ఆదిలాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. పలువురు బాధితులకు రూ.1.11 కోట్లకు పైగా చెల్లించాల్సి ఉన్నట్లు అధికారులు తెలిపారు.
హనుమకొండ జిల్లా వడ్డెపల్లికి చెందిన పేరాల శ్రీనివాసరావు 2009లో అక్షర చిట్‌ఫండ్స్ పేరుతో వ్యాపారం ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో చిట్టీ స్కీములను ప్రవేశపెట్టి, ప్రజల నుంచి పెద్ద మొత్తంలో డిపాజిట్లు సేకరించారు. అయితే, గడువు ముగిసిన తర్వాత డబ్బులు తిరిగి చెల్లించకుండా మోసాలకు పాల్పడినట్లు ఆరోపణలున్నాయి.
ఆదిలాబాద్ టూటౌన్ పోలీస్ స్టేషన్లో 12 కేసులు నమోదయ్యాయి. బాధితులకు రూ.1.11 కోట్లు చెల్లించాల్సి ఉంది. దీంతో పాటు, రాష్ట్రంలోని ఇతర పోలీస్ స్టేషన్లలోనూ 96 చీటింగ్ కేసులు నమోదైనట్లు సమాచారం. ఈ నేపథ్యంలో, శ్రీనివాసరావు గత ఆరు నెలలుగా పోలీసుల కళ్లుగప్పి తిరుగుతున్నారు.
సాంకేతిక ఆధారాల సహాయంతో ఆదిలాబాద్‌లో శ్రీనివాసరావు ఉన్నట్లు గుర్తించిన పోలీసులు, అతన్ని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో భాగంగా, అతనికి కరీంనగర్, ఖమ్మం, వరంగల్, హైదరాబాద్‌లలో ఆస్తులు ఉన్నట్లు తెలిసింది. ఇప్పటికే కొన్ని ఆస్తులను స్వాధీనం చేసుకున్నామని, మిగిలిన వాటిని కూడా చట్టపరంగా జప్తు చేసేందుకు చర్యలు తీసుకుంటామని ఆదిలాబాద్ ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు.











