అన్నమయ్య జిల్లా వాల్మీకిపురంలో భర్త తన భార్యను గోడకేసి కొట్టి దారుణంగా హత్య చేసిన సంఘటన ఆదివారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. నిందితుడు పోలీసుల ఎదుట లొంగిపోయాడు.
పీలేరు నియోజకవర్గం వాల్మీకిపురానికి చెందిన జగదీష్, మౌనిక దంపతులు స్థానికంగా టీ దుకాణం నిర్వహించుకుంటూ జీవనం సాగించేవారు. ఇటీవల వ్యాపారం నిలిపివేసి, ఉద్యోగం వెతుక్కుంటూ బెంగళూరుకు వెళ్లారు.
బెంగళూరు నుంచి తిరిగి వచ్చిన జగదీష్, ఆదివారం మధ్యాహ్నం తన భార్య మౌనికను ఇంట్లోని గోడకేసి బలంగా కొట్టడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది.
సమాచారం అందిన వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, హత్యకు గల కారణాలపై విచారణ చేపట్టారు. నిందితుడు జగదీష్ స్వయంగా పోలీస్ స్టేషన్కు వెళ్లి తన భార్యను తానే హత్య చేసినట్లు లొంగిపోయినట్లు సమాచారం.
ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది. పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.











