బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్‌పై నమోదైన పోక్సో కేసులో బాధితురాలి తల్లి బహిరంగ లేఖ రాశారు. తన కుమార్తెకు జరిగిన అన్యాయంపై ఆవేదన వ్యక్తం చేస్తూ, ఈ కేసులో స్వతంత్ర దర్యాప్తు జరిపించాలని ఆమె కోరారు. తమకు వ్యవస్థల నుంచి న్యాయం అందాలని వేడుకున్నారు.
పోక్సో చట్టం కింద నమోదైన కేసులో బాధితురాలైన తన కుమార్తె తరఫున తల్లి ఆవేదన వ్యక్తం చేశారు. తన కుమార్తెకు రక్షణ, గౌరవం, భవిష్యత్తు అందరిలానే పొందే హక్కు ఉందని, ఈ కేసులో స్వతంత్ర దర్యాప్తు జరిపించాలని ఆమె కోరారు. తాము సాధారణ మధ్యతరగతి కుటుంబానికి చెందిన వాళ్లమని, రాజకీయం, పలుకుబడి తమకు లేవని ఆమె తెలిపారు. తమ బిడ్డను కాపాడమని, తమ న్యాయపోరాటాన్ని వినమని సమాజంలోని వ్యవస్థలను వేడుకునే పరిస్థితి వస్తుందని కలలో కూడా ఊహించలేదని ఆమె పేర్కొన్నారు.
బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్‌తో 2025లో పరిచయం ఏర్పడిందని, మొదట్లో సాధారణ పరిచయంగా మొదలైన సంబంధం, ఆ తర్వాత భగీరథ్ పదేపదే మాట్లాడడం, బలవంతంగా ఒప్పించడం, ప్రలోభాలకు గురి చేయడం వల్ల తన కుమార్తె ఆయనపై మానసికంగా ఆధారపడిందని తల్లి లేఖలో వివరించారు. మాయమాటలు చెప్పి లొంగదీసుకోవడంతో తన కుమార్తె బండి భగీరథ్ నియంత్రణలోకి వెళ్లిపోయిందని, తనకు ఇష్టం లేకపోయినా, అనేక సార్లు తీవ్రంగా ప్రతిఘటించినా శారీరక సంబంధం కోసం భగీరథ్ తన కుమార్తెపై పదేపదే ఒత్తిడి తెచ్చారని ఆరోపించారు. ముఖ్యంగా 2025 డిసెంబరు 31వ తేదీ రాత్రి నుంచి 2026 జనవరి 1వ తేదీ తెల్లవారుజాము వరకు మొయినాబాద్‌లో తనపై జరిగిన దాడిని, తనకు ఇష్టం లేకున్నా మద్యం సేవించాలని ఒత్తిడి తెచ్చిన భగీరథ్ అచేతన స్థితిలో ఉన్నప్పుడు అనుచిత ప్రవర్తనకు దిగి, బలవంతంగా శారీరకంగా దాడి చేశాడని తన కుమార్తె తెలిపినట్లు తల్లి పేర్కొన్నారు.
ఆ ఘటనలను గుర్తు చేసుకున్న ప్రతీసారి తన కుమార్తె కళ్లల్లో భయం, అవమానం ఇప్పటికీ కనిపిస్తున్నాయని ఆమె తెలిపారు. బండి భగీరథ్ ఆ తర్వాత చాట్ ద్వారా, మొబైల్ ద్వారా పదేపదే క్షమాపణలు చెప్పాడని, బాధ కలిగించినట్టు అంగీకరించి క్షమాపణ కోరాడని ఆమె వెల్లడించారు. ఈ సంఘటనల తర్వాత 2026 జనవరిలో తన కుమార్తె మానసికంగా మరింత కుంగిపోయిందని, ఒంటరిగా కూర్చొని ఏడవడం, ఆత్మవిశ్వాసం కోల్పోయి ప్రతి రోజు నరకం అనుభవించడం చూశామని తల్లి తెలిపారు. బండి భగీరథ్ కూడా తన కూతురి పరిస్థితి చూసి ఆందోళనగా ఉందని అన్నాడంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో, ఎంత మానసిక నష్టాన్ని కలిగించాడో అర్థం చేసుకోవచ్చని ఆమె అన్నారు. 2026 మార్చి, ఏప్రిల్ నెలల్లో ఈ ఘటనపై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు ధైర్యం చేసినా, పరోక్ష ఒత్తిళ్లు, బెదిరింపులు ఎదురయ్యాయని ఆమె పేర్కొన్నారు.
2026 ఏప్రిల్ 21న అకస్మాత్తుగా తమ కుటుంబంపై వసూళ్లు, బ్లాక్మెయిల్ ఆరోపణలతో ఒక ఫిర్యాదు నమోదైందని, సాధారణ పౌరులమైన తాము దాంతో భయపడిపోయామని, బాధితులైన తమపైనే నిందితులు అని ముద్ర వేసే ప్రయత్నం జరిగిందని తల్లి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఇంటికి వెళ్లినా, తిరిగి వచ్చేటప్పుడు రాజకీయ ప్రభావం, మద్దతుదారులు తమ కుటుంబానికి ఇబ్బంది కలిగించవచ్చని అనిపించిందని, ఆ రోజు నుంచి నేటి వరకు తమ కుటుంబం మొత్తం నిరంతర భయం, మానసిక ఒత్తిడిలో జీవిస్తున్నామని తెలిపారు. పేట్ బషీరాబాద్ పోలీసు స్టేషన్లో కేసు నమోదు చేయాలని కోరినప్పుడు పోలీసులు ఐదు గంటలు వేచి ఉండేలా చేశారని, జీరో ఎఫ్ఐఆర్ విధానం గురించి పట్టుబట్టిన తర్వాతే రశీదు జారీ చేశారని, ఆ ఐదు గంటలు తమకు ఆవేదనాభరితం అని ఆమె పేర్కొన్నారు.







