రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్ల పథకం రెండో విడత జూన్ 2న ఆదిలాబాద్ నుంచి ప్రారంభం కానుంది. తొలి విడతలో మూడు లక్షలకు పైగా ఇళ్లు మంజూరు చేయనున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు.
రాష్ట్ర గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి శుక్రవారం సచివాలయంలో వరంగల్, ఖమ్మం జిల్లాల హౌసింగ్, రెవెన్యూ అంశాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇందిరమ్మ ఇళ్ల రెండో విడతను జూన్ 2వ తేదీన ఆదిలాబాద్ నుంచి ప్రారంభిస్తామని, తొలి విడతలో మూడు లక్షలకు పైగా ఇళ్లు మంజూరు చేస్తామని వెల్లడించారు.
మంత్రి శ్రీనివాసరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం, 2.90 లక్షల ఇళ్ల గ్రౌండింగ్ ఇప్పటికే పూర్తయింది. 50 వేల గృహప్రవేశాలు కూడా పూర్తయ్యాయి. మరో 2 లక్షల ఇళ్లు నిర్మాణ దశలో ఉన్నాయి. ప్రతి నియోజకవర్గానికి 3500 ఇళ్లు మంజూరు చేశామని, ఐటీడీఏ ప్రాంతాలకు అదనపు ఇళ్లు కేటాయిస్తున్నామని ఆయన పేర్కొన్నారు.
అర్హులందరికీ ఇళ్లు అందించే వరకు ఈ పథకాన్ని 3, 4 విడతలుగా కొనసాగిస్తామని మంత్రి స్పష్టం చేశారు. పాత ఇందిరమ్మ లబ్ధిదారులకు కూడా కొత్త ఇళ్లు మంజూరు చేస్తామని తెలిపారు. 600 చదరపు అడుగుల ఇళ్ల బిల్లుల చెల్లింపునకు సంబంధించి అధికారులను ఆదేశించారు. ఈ విషయంలో ఫారెస్ట్, సింగరేణి శాఖల నుంచి ఎటువంటి అడ్డంకులు ఎదురవకుండా చూడాలని సూచించారు.
డబుల్ బెడ్రూమ్ కాలనీల్లో మౌలిక వసతుల కల్పనను పూర్తి చేయాలని, ఉచిత ఇసుకను సమీప ప్రాంతాల్లో అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. ఖమ్మం, వరంగల్లో భూ వివాదాలపై జాయింట్ సర్వే నిర్వహిస్తామని, రోవర్స్ సర్వే ద్వారా భూ సరిహద్దు వివాదాలు పరిష్కారమవుతాయని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు.











