లంచం తీసుకుంటుండగా బోధన్ పట్టణ పోలీస్ స్టేషన్ లో పనిచేస్తున్న ఎస్ఐ 1 భాస్కర చారీ నిజామాబాద్ రేంజ్ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయారు. బుధవారం జరిగిన ఈ ఘటనలో అతడు రూ.7,000 లంచం అందుకుంటుండగా పట్టుబడ్డారు.
నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణ పోలీస్ స్టేషన్ లో ఎస్ఐ 1 గా విధులు నిర్వహిస్తున్న భాస్కర చారీ, ఒక వ్యక్తి నుండి రూ.7,000 లంచం తీసుకుంటుండగా ఏసీబీ డీఎస్పీ శేఖర్ గౌడ్ ఆధ్వర్యంలోని బృందం పట్టుకుంది. ఈ లంచం ఒక సివిల్ వివాదానికి సంబంధించిన కేసులో సెక్షన్ మార్పు కోసం డిమాండ్ చేసినట్లు ప్రాథమికంగా తెలిసింది.
అవినీతి నిరోధక శాఖ అధికారులు ఎస్ఐ భాస్కర చారీపై అవినీతి నిరోధక చట్టం ప్రకారం కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఉన్నతాధికారుల ప్రమేయంపై కూడా విచారణ జరుగుతున్నట్లు సమాచారం.
ఇదిలా ఉండగా, నిజామాబాద్ జిల్లాలో కొద్ది రోజుల వ్యవధిలోనే మరో ఎస్ఐ అవినీతి కేసులో పట్టుబడటం పోలీసు శాఖలో కలకలం సృష్టిస్తోంది. గతంలో వర్ని ఎస్ఐ కూడా ఏసీబీకి చిక్కారు.
ఎస్ఐ భాస్కర చారీని ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకుని, తదుపరి విచారణ కోసం తరలించారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.












