ఆధునిక భారతదేశంలో పెరుగుతున్న సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మోసపోతే వెంటనే ఫిర్యాదు చేయాలని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ సూచించారు. సైబర్ నేరాల నివారణపై అవగాహన కల్పించే క్రమంలో ఆయన ఈ ప్రకటన విడుదల చేశారు.
ప్రస్తుత డిజిటల్ యుగంలో ఆన్లైన్ మోసాలు అనేకం ఉన్నాయని, ఏపీకే ఫైల్స్, జాబ్ ఫ్రాడ్, లోన్ ఫ్రాడ్, ఈ-కామర్స్ ఫ్రాడ్, కస్టమర్ కేర్ ఫ్రాడ్, స్టాక్ మార్కెటింగ్ ఫ్రాడ్ వంటి వాటి పట్ల జాగ్రత్త వహించాలని ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. ప్రజలు ఇలాంటి వాటిని నమ్మవద్దని, ఒకవేళ మోసపోతే వెంటనే స్పందించాలని సూచించారు.
సైబర్ నేరాల బారిన పడినవారు వెంటనే జాతీయ సైబర్ క్రైమ్ వెబ్సైట్ లేదా 1930 నంబర్‌కు సంప్రదించి ఫిర్యాదు చేయాలని ఎస్పీ కోరారు. నేరం జరిగిన వెంటనే గంటలోపు ఫిర్యాదు చేయడం వల్ల నష్టపోయిన డబ్బును తిరిగి పొందే అవకాశాలు మెరుగుపడతాయని, దీనినే 'గోల్డెన్ హవర్'గా పరిగణిస్తారని ఆయన వివరించారు.
ముఖ్యంగా నిరుద్యోగ యువతను ఆకర్షించి 'వర్క్ ఫ్రం హోమ్' అవకాశాల పేరుతో మోసం చేస్తున్నారని, అలాగే ఆన్లైన్ షాపింగ్‌లోనూ మోసాలు జరుగుతున్నాయని ఎస్పీ హెచ్చరించారు. లోన్ యాప్‌ల ద్వారా రుణాలు తీసుకునే వారిని కూడా సైబర్ నేరగాళ్లు లక్ష్యంగా చేసుకుంటున్నారని ఆయన తెలిపారు. తెలియని అప్లికేషన్లను ఫోన్లో ఇన్స్టాల్ చేసుకోవడం వల్ల డేటా చోరీకి గురయ్యే ప్రమాదం ఉందని కూడా ఆయన పేర్కొన్నారు.










