కరీంనగర్ టూ టౌన్ ఎస్సై చంద్రశేఖర్, ఆయన భార్య దివ్యల ఆత్మహత్య ఘటన కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. భార్య మరణంతో మనస్తాపానికి గురైన ఎస్సై కూడా బలవన్మరణానికి పాల్పడటంతో, వారిద్దరు కుమారులు అనాథలయ్యారు.
భార్య దివ్య కడుపునొప్పి భరించలేక ఆత్మహత్య చేసుకుంటున్నానని భర్త చంద్రశేఖర్‌కు, తండ్రికి ఫోన్ చేసి బలవన్మరణానికి పాల్పడింది. ఆమె మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకెళ్లగా, బంధువులు చంద్రశేఖర్‌పై దాడికి దిగారు. పరిస్థితిని చక్కదిద్దే క్రమంలో దివ్య తండ్రి చంద్రశేఖర్‌ను గదిలో బంధించారు.
అంత్యక్రియల సమయంలో, తాను కూడా చనిపోతానని, తన అంత్యక్రియలు కూడా అక్కడే నిర్వహించాలని చంద్రశేఖర్ రోదించినట్లు సమాచారం. తీవ్ర మనోవేదనతో, ఇద్దరు కుమారులను చూస్తూ, భార్య మరణానికి తానే కారణమని భావించి, అత్తారింట్లోనే ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
పోస్ట్ మార్టం అనంతరం చంద్రశేఖర్ మృతదేహానికి, దివ్య అంత్యక్రియలు జరిగిన చోటే అంత్యక్రియలు నిర్వహించారు. ఈ సంఘటనతో, కేవలం ఐదు రోజుల్లోనే తల్లిదండ్రులను కోల్పోయి ఇద్దరు చిన్నారులు అనాథలయ్యారు. పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు ముమ్మరం చేశారు.











