'గ్రైండర్' యాప్ వేదికగా అమాయక యువకులను మోసం చేసి, వారిని నిర్మానుష్య ప్రాంతాలకు తీసుకెళ్లి దోపిడీలకు పాల్పడుతున్న ఏడుగురు సభ్యుల ముఠాను కీసర పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల వద్ద నుండి భారీగా నగదు, నగలు, వాహనాలు, మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.
పోలీసుల కథనం ప్రకారం, నిందితులు 'గ్రైండర్' యాప్ ద్వారా బాధితులను ఆకర్షించి, నమ్మించి వాహనాల్లో ఎక్కించుకునేవారు. అనంతరం వారిని నిర్మానుష్య ప్రాంతాలకు తీసుకెళ్లి, దాడి చేసి బంగారు గొలుసుతో పాటు నగదు దోచుకునేవారు. బాధితులను బెదిరించి, భయపెట్టేందుకు వారి మొబైల్ ఫోన్లలో వీడియోలు రికార్డ్ చేసేవారని విచారణలో వెల్లడైంది.
ఈ నెల 6వ తేదీ రాత్రి జరిగిన ఒక సంఘటనలో, నిందితులు ఒక యువకుడిని లిఫ్ట్ అడిగే సాకుతో కారు ఎక్కించుకుని, నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి దాడి చేసి 16 గ్రాముల బంగారు గొలుసును దోచుకున్నారు. బాధితుడిని బెదిరించి అక్కడి నుండి పరారయ్యారు.
పోలీసులు చేపట్టిన దర్యాప్తులో, నిందితుల కార్యకలాపాలు బయటపడ్డాయి. వీరిలో కొందరు గతంలో కూడా వివిధ నేరాలకు పాల్పడి, పోలీసుల రికార్డుల్లో ఉన్నట్లు గుర్తించారు. వారిపై హత్యాయత్నం, దారి దోపిడీ, డ్రగ్స్ వంటి కేసులు నమోదై ఉన్నాయి.
ఈ కేసును ఛేదించడంలో చురుగ్గా వ్యవహరించిన పోలీసు బృందాన్ని ఉన్నతాధికారులు అభినందించారు. ప్రజలు అపరిచితులతో అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా ఆన్లైన్ ద్వారా పరిచయమైన వారి విషయంలో జాగ్రత్త వహించాలని పోలీసులు సూచించారు.











