మళ్లీ ఆడపిల్ల పుడుతుందనే అనుమానంతో, సొంత తండ్రే తన ఇద్దరు కూతుళ్లను స్విమ్మింగ్ పూల్లో తోసి హత్య చేసిన దారుణ ఘటన హన్మకొండ జిల్లాలో వెలుగుచూసింది. ఈ సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది.
హన్మకొండ జిల్లా ఐనవోలు మండలం పున్నేలు గ్రామ శివారులో నివాసం ఉంటున్న అజారుద్దీన్, తన భార్య ఫర్హాత్ (26) మరియు కూతుళ్లు ఉమేరా (8), అయేషా (6)తో కలిసి జీవిస్తున్నాడు. గతంలో ఇద్దరు ఆడపిల్లలు పుట్టడంతో, ఫర్హాత్ రెండు సార్లు గర్భం దాల్చినప్పుడు ఆడపిల్ల పుడుతుందనే అనుమానంతో అబార్షన్ చేయించినట్లు తెలుస్తోంది.
నాలుగేళ్ల తర్వాత ఫర్హాత్ మళ్లీ గర్భవతి కావడంతో, ఈసారి కూడా ఆడపిల్ల పుడుతుందనే భయంతో భర్త అజారుద్దీన్, ఆమెను అబార్షన్ చేయించుకోవాలని ఒత్తిడి చేశాడు. అయితే, ఆమె అందుకు అంగీకరించలేదు. దీంతో ఆగ్రహించిన అజారుద్దీన్, తన భార్య, పిల్లలను స్విమ్మింగ్ పూల్ వద్దకు తీసుకెళ్లి, వారిని అందులో తోసి హత్య చేశాడు.
అనంతరం, ఈ సంఘటనను ప్రమాదంగా చిత్రీకరించడానికి ప్రయత్నించాడు. కానీ, ఫర్హాత్ తండ్రికి అజారుద్దీన్ ప్రవర్తనపై అనుమానం రావడంతో, పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు అజారుద్దీన్ను అదుపులోకి తీసుకుని విచారించగా, తానే ఈ దారుణానికి పాల్పడినట్లు అంగీకరించాడు.
ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఆడపిల్లలంటే ఇంత కక్షతో ఒక తండ్రి ఇలాంటి ఘోరానికి పాల్పడటంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.











