ఆన్లైన్ పేకాటలో డబ్బులు పోగొట్టుకున్న నిందితుడు, ఆ డబ్బుల కోసం ఇద్దరు వృద్ధురాళ్లను దారుణంగా హత్య చేసిన ఘటన హైదరాబాద్లో వెలుగుచూసింది. నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.
హైదరాబాద్లో కలకలం రేపిన జంట హత్యల కేసులో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆన్లైన్ పేకాటలో డబ్బులు పోగొట్టుకున్న నిందితుడు, డబ్బుల కోసం ఇద్దరు వృద్ధురాళ్లను హత్య చేశాడు. మృతదేహాలపై ఉన్న బంగారాన్ని అమ్మి, ఆ డబ్బుతో ఆన్లైన్ పేకాట ఆడినట్లు పోలీసుల విచారణలో తేలింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, నిందితుడు వాసు, జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 44లో ఒక వైద్యుడి ఇంట్లో కారు డ్రైవర్గా పనిచేస్తున్నాడు. గత నెల 11వ తేదీన, కారులో లిఫ్ట్ ఇస్తానని యాదమ్మ అనే వృద్ధురాలిని ఎక్కించుకొని, ఆమెను హత్య చేశాడు. ఆమె ఒంటిపై ఉన్న బంగారాన్ని అమ్మి, ఆ వచ్చిన రూ.26,500తో ఆన్లైన్ పేకాట ఆడాడు.
పేకాటలో మొత్తం డబ్బును పోగొట్టుకోవడంతో, మరింత డబ్బు కోసం మంగమ్మ అనే మరో వృద్ధురాలిని లక్ష్యంగా చేసుకున్నాడు. గత నెల 14వ తేదీన, ఆమెను కూడా కారులో ఎక్కించుకొని హత్య చేశాడు. పట్టపగలే, ఇద్దరు వృద్ధుల మృతదేహాలను తన కారులో తరలించి, సుమారు 20 కిలోమీటర్ల దూరంలోని మోకిలలో పారేశాడు.
ఈ జంట హత్యల కేసులో నిందితుడిని ఫిలింనగర్ పోలీసులు అరెస్ట్ చేసి, రిమాండ్కు తరలించారు. సీఎం రేవంత్ రెడ్డి ఇంటి సమీపంలోనే ఈ ఘటనలు జరగడం కలకలం రేపింది. నిందితుడు ఆన్లైన్ జూదం వ్యసనానికి బానిసై ఈ ఘోరాలకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. కేసు దర్యాప్తు కొనసాగుతోంది.











