కామారెడ్డి జిల్లాలో ఎక్సైజ్ అధికారులు భారీ మొత్తంలో ఎండు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. సంబల్ పూర్ నుండి నాందేడ్ వెళ్తున్న నాగవల్లి ఎక్స్ప్రెస్ రైలులో ఈ గంజాయిని గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఉమ్మడి నిజామాబాద్ డివిజన్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ కమిషనర్ రఘురామ్, కామారెడ్డి జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారి బి. హన్మంతరావు ఆదేశాల మేరకు అధికారులు ఈ ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. నమ్మదగిన సమాచారం మేరకు సంబల్ పూర్ నుండి నాందేడ్ వెళ్తున్న నాగవల్లి ఎక్స్ప్రెస్ (రైలు నం. 20809)లో తనిఖీలు చేపట్టారు.
రైలులోని ఎస్-7 బోగీలో ఒక బెర్త్ కింద దాచిన రెండు బ్యాగుల్లో ఎండు గంజాయి ఉన్నట్లు అధికారులు గుర్తించారు. బ్యాగులను పరిశీలించగా, మొత్తం 22 ప్యాకెట్లలో ఎండు గంజాయి ఉన్నట్లు తేలింది. స్వాధీనం చేసుకున్న గంజాయిని తూకం వేయగా 20 కిలోల బరువు ఉన్నట్లు అధికారులు తెలిపారు.
గంజాయిని తరలిస్తున్న వ్యక్తి ఆచూకీ లభించకపోవడంతో, నిందితుడి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ దాడుల్లో ట్రైనీ AES వి. అరుణ్ చంద్ర, డీటీఎఫ్ సీఐ సుందర్ సింగ్, ఎస్ఐలు విక్రమ్, శరత్ కుమార్, దీపిక, ట్రైనీ ఎస్ఐ మధుసూదన్, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
ఈ ఘటనపై కామారెడ్డి ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి, దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ సంఘటనతో డ్రగ్స్ రవాణాపై అధికారులు దృష్టి సారించారు.


