తన పేరుతో పాటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు షబ్బీర్ అలీ పేరును ఉపయోగించి సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్న ఆడియో పూర్తిగా నకిలీదని, దీనిపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ కార్యకర్త గీరెడ్డి మహేందర్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
కామారెడ్డి సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ (డీఎస్పీ), కామారెడ్డి పోలీస్ స్టేషన్ ఎస్హెచ్వోలకు మహేందర్ రెడ్డి ఫిర్యాదు అందజేశారు. గత 40 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తున్న తాను, షబ్బీర్ అలీతో ఎలాంటి ఫోన్ సంభాషణ జరపలేదని ఆయన స్పష్టం చేశారు.
జూన్ 12 రాత్రి నుంచి కొందరు వ్యక్తులు తాను, షబ్బీర్ అలీ మాట్లాడుకున్నట్లుగా, కాంగ్రెస్ నాయకులను విమర్శించినట్లుగా, మహిళల గురించి అసభ్యకరంగా మాట్లాడినట్లుగా ఒక నకిలీ ఆడియోను సృష్టించి వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ వంటి సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు.
ఈ ఆడియో ప్రచారం అనంతరం తనపై సోషల్ మీడియాలో అసభ్యకర వ్యాఖ్యలు, దూషణలు జరుగుతున్నాయని, కొందరు బెదిరింపులకు పాల్పడుతున్నారని మహేందర్ రెడ్డి తెలిపారు. కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు సృష్టించడం, పార్టీని చీల్చడం, నాయకుల ప్రతిష్ఠను దెబ్బతీయడం లక్ష్యంగా ఈ కుట్ర జరిగి ఉండవచ్చని ఆయన అనుమానం వ్యక్తం చేశారు.
నకిలీ ఆడియో సృష్టించిన, ప్రచారం చేస్తున్న వ్యక్తులను గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. నకిలీ ఆడియో ప్రచారం వల్ల తన ప్రతిష్ఠకు తీవ్ర నష్టం కలిగిందని, ఈ వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు జరిపి న్యాయం చేయాలని పిర్యాదులో కోరారు. కామారెడ్డి సీఐ నరహరి ఈ విషయంపై విచారణ చేపట్టినట్టు సమాచారం.












