కామారెడ్డి జిల్లాలో అడవి జంతువుల అక్రమ వేటకు పాల్పడుతున్న ముఠాను పోలీసులు 'ఆపరేషన్ కవచ్' పేరుతో పట్టుకున్నారు. ఈ ఘటనలో 8 మందిని అరెస్ట్ చేసి, వారి వద్ద నుంచి 5 నాటు తుపాకులు, ఒక ఎయిర్ గన్, ఇతర వేట సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు.
జిల్లా ఎస్పీ ఎం. రాజేష్ చంద్ర ఆదేశాల మేరకు గాంధారి పోలీసులు ఈ ఆపరేషన్ నిర్వహించారు. మొండి సడక్ చౌరస్తా వద్ద వాహన తనిఖీల్లో భాగంగా అనుమానాస్పదంగా కనిపించిన ఇద్దరు బైక్‌లపై వెళ్తున్న ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద రెండు నాటు తుపాకులు, గన్‌పౌడర్, పొటాష్, స్టీల్ పెల్లెట్స్ లభ్యమయ్యాయి.
పోలీసులు ముమ్మరంగా విచారణ చేపట్టడంతో, అక్రమ వేట ముఠా నెట్వర్క్ బయటపడింది. నిందితులు అడవి జంతువుల వేట కోసం అక్రమంగా నాటు తుపాకులను కొనుగోలు చేసినట్లు విచారణలో వెల్లడైంది. ఈ క్రమంలో మరిన్ని నాటు తుపాకులు, ఎయిర్ గన్, ట్రిగ్గర్ మెకానిజంలు, బ్యారెల్స్, రెండు మోటార్‌సైకిళ్లు, ఇతర వేట సామగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఈ కేసులో కీలక పాత్ర పోషించిన సదాశివనగర్ సీఐ బి. సంతోష్ కుమార్, గాంధారి ఎస్ఐ మహేందర్, తాడ్వాయి ఎస్ఐ నరేష్‌తో పాటు పోలీసు సిబ్బందిని ఎస్పీ అభినందించారు. జిల్లాలో అక్రమ ఆయుధాలు, వన్యప్రాణుల వేటకు తావులేదని, 'ఆపరేషన్ కవచ్' ద్వారా నిరంతర నిఘా కొనసాగిస్తామని ఎస్పీ రాజేష్ చంద్ర హెచ్చరించారు.












