ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా ఉద్యోగం సంపాదించడానికి నకిలీ బోనఫైడ్ సర్టిఫికెట్లు సమర్పించిన రాజేశ్ అనే వ్యక్తిని హైదరాబాద్ జిల్లా విద్యాశాఖాధికారి (డీఈఓ) రోహిణి ఉద్యోగం నుంచి తొలగించారు. హైదరాబాద్ స్పెషల్ బ్రాంచ్ పోలీసులు ఈ మోసాన్ని బయటపెట్టారు.
అసిఫ్ నగర్ మండలం గులాబ్ సింగ్ ప్రాథమిక పాఠశాలలో ఎస్జీటీగా నియమితులైన రాజేశ్, తన డీఎస్సీ ఉద్యోగ దరఖాస్తులో స్థానికతను నిరూపించుకోవడానికి నకిలీ ధ్రువపత్రాలను ఉపయోగించినట్లు విచారణలో తేలింది. డీఎస్సీ దరఖాస్తులో ఒక పాఠశాల బోనఫైడ్, గ్రూప్-4 దరఖాస్తులో మరో పాఠశాల బోనఫైడ్ సమర్పించడం అనుమానాలకు తావిచ్చింది.
డీఎస్సీ నియామక ప్రక్రియ సమయంలో, రాజేశ్ గీతాంజలి పాఠశాల బోనఫైడ్ సర్టిఫికెట్ ను అధికారులకు చూపించి ఉద్యోగం పొందారు. అయితే, డీఎస్సీ-2024లో అర్హత సాధించిన అభ్యర్థులపై వచ్చిన ఫిర్యాదులను విచారిస్తున్న స్పెషల్ బ్రాంచ్ పోలీసులు ఈ మోసాన్ని కనుగొన్నారు. నకిలీ పత్రాలతో ప్రభుత్వాన్ని మోసం చేసినందుకు తెలంగాణ సివిల్ సర్వీసెస్ రూల్స్ ప్రకారం రాజేశ్ పై చర్యలు తీసుకున్నారు.
ఇటీవల డీఎస్సీ-2024 నోటిఫికేషన్ ద్వారా హైదరాబాద్ జిల్లాలో అనేక టీచర్ పోస్టులు భర్తీ అయ్యాయి. ఈ క్రమంలో, మూతపడిన పాఠశాలల నుంచి నకిలీ టీసీలు, బోనఫైడ్ సర్టిఫికెట్లు సమర్పించి కొందరు అభ్యర్థులు ఉద్యోగాలు పొందినట్లు ఆరోపణలు వచ్చాయి. స్పెషల్ బ్రాంచ్ గుర్తించిన 12 నకిలీ సర్టిఫికెట్లలో రాజేశ్ వ్యవహారం ఒకటి.







