ఆదాయపు పన్ను చెల్లించేవారు, ఖరీదైన వాహనాలు, అధిక భూమి ఉన్నవారు, మరణించిన వారి పేర్లతో ఉన్న రేషన్ కార్డులను తొలగించేందుకు తెలంగాణ ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ఈ ప్రక్రియ ద్వారా ప్రభుత్వ ఖజానాకు ఆదాయం పెరగడంతో పాటు, నిజమైన లబ్ధిదారులకు సంక్షేమ పథకాలు అందే అవకాశం ఉంది.
రాష్ట్రంలో అర్హత లేని రేషన్ కార్డుల తొలగింపు ప్రక్రియను ప్రభుత్వం ప్రారంభించింది. ఆదాయపు పన్ను చెల్లించేవారు, ఖరీదైన వాహనాలు కలిగి ఉన్నవారు, అధిక భూమి ఉన్నవారు, మరణించిన వారి పేర్లతో కొనసాగుతున్న కార్డులను గుర్తించి తొలగించేందుకు చర్యలు చేపడుతున్నారు. ఈ క్రమంలో, అనర్హుల కార్డుల తొలగింపుతో ప్రభుత్వ ఖజానాకు భారీగా ఆదాయం సమకూరే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.
ప్రస్తుతం రాష్ట్రంలో 1.05 కోట్ల రేషన్ కార్డులు ఉండగా, కేంద్రం 99.36 లక్షల కార్డులకు ఉచిత బియ్యం పంపిణీ చేస్తోంది. అయితే, ఆదాయపు పన్ను చెల్లిస్తున్న 52,339 మంది, 15 ఎకరాలకు పైగా భూమి కలిగి ఉండి రైతు భరోసా ద్వారా రూ.1.50 లక్షలకు పైగా ఆదాయం పొందుతున్న 5,866 మంది, మరణించిన 83,545 మంది పేర్లపై రేషన్ పంపిణీ జరుగుతోందని అధికారులు గుర్తించారు. దీనివల్ల ప్రభుత్వానికి ఏటా రూ.135 కోట్ల మేర నష్టం వాటిల్లుతోందని అంచనా.
రేషన్ కార్డు పొందడానికి పట్టణ ప్రాంతాల్లో ఏడాదికి రూ.2 లక్షలు, గ్రామీణ ప్రాంతాల్లో రూ.1.50 లక్షల లోపు ఆదాయం ఉండాలనే నిబంధనలున్నాయి. అయితే, ఈ నిబంధనలను ఉల్లంఘించి, అధిక ఆదాయం ఉన్నప్పటికీ పేదల ముసుగులో రేషన్ కార్డులు పొందినవారు, ఉచిత బియ్యం బ్లాక్ మార్కెట్లో అమ్ముకుంటున్నారని ఫిర్యాదులు అందుతున్నాయి. దాదాపు 8 లక్షలకు పైగా కుటుంబాలు ఏటా రూ.25 లక్షల ఆదాయం కలిగి ఉండి కూడా రేషన్ కార్డులు కలిగి ఉన్నాయని ప్రభుత్వం గుర్తించింది.
గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో, అలాగే ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా అర్హత లేని వారికి అడ్డగోలుగా రేషన్ కార్డులు మంజూరు చేశారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నవారిని క్షేత్రస్థాయిలో పరిశీలించాల్సిన అధికారులు ముడుపులు తీసుకుని చేతులు దులుపుకున్నారని సమాచారం. కేంద్ర ఆహార, పంపిణీ శాఖ సహాయ మంత్రి ఇటీవల పార్లమెంటులో తెలంగాణలో 1.40 లక్షల రేషన్ కార్డులను తొలగించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ప్రకటించారు. కేంద్రం గుర్తించిన జాబితాను తెలంగాణ పౌరసరఫరాల శాఖకు పంపినట్లు తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా రేషన్ కార్డులు పొందిన వారికి నోటీసులు జారీ చేసి, తొలగింపునకు గల కారణాలను వివరించాలని కేంద్రం సూచించింది. ఈ నేపథ్యంలో, జిల్లా పౌరసరఫరాల అధికారులు ఆ దిశగా చర్యలు చేపట్టడానికి సిద్ధమవుతున్నారు.











