నిజామాబాద్ జిల్లాలో అక్రమ కార్యకలాపాలపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య ఆదేశాల మేరకు, సీసీఎస్ ఇన్చార్జ్ ఏసీపీ మస్తాన్ అలీ ఆధ్వర్యంలో సీసీఎస్ బృందం బుధవారం పలు ప్రాంతాల్లో మెరుపు దాడులు నిర్వహించింది. ఈ దాడుల్లో పేకాట స్థావరాలు, పీడీఎస్ బియ్యం అక్రమ నిల్వలు బయటపడ్డాయి.
ఎడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఏఆర్ క్యాంప్ వద్ద పేకాట స్థావరంపై సీసీఎస్ బృందం దాడి చేసింది. ఈ క్రమంలో ఇద్దరు వ్యక్తులు పట్టుబడగా, మరో నలుగురు పరారీ అయ్యారు. సంఘటనా స్థలం నుంచి రెండు మొబైల్ ఫోన్లు, రూ.30,000 నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసును తదుపరి చర్యల కోసం ఎడపల్లి ఎస్హెచ్ఓకు అప్పగించారు.
బోధన్ పోలీస్ స్టేషన్ పరిధిలో మూడు వేర్వేరు ప్రాంతాల్లో పీడీఎస్ బియ్యం అక్రమ నిల్వలను సీసీఎస్ బృందం గుర్తించి స్వాధీనం చేసుకుంది. ఓల్డ్ బస్ స్టాండ్ సమీపంలోని రైస్ డిపోలో 40 బస్తాలు (సుమారు రూ.45,000 విలువ), పోస్టాఫీస్ సమీపంలోని మరో డిపోలో 55 బస్తాలు (సుమారు రూ.55,000 విలువ) స్వాధీనం చేసుకున్నారు.
అదే ప్రాంతంలో, టాటా ఏస్ వాహనం (AP 25 W 1481)లో తరలిస్తున్న సుమారు 150 కిలోల పీడీఎస్ బియ్యాన్ని (రూ.5,000 విలువ) కూడా స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న బియ్యం, వాహనాన్ని బోధన్ పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓకు అప్పగించి, కేసులు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
అక్రమ కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. జిల్లాలో ఇలాంటి దాడులు నిరంతరం కొనసాగుతాయని స్పష్టం చేశారు.












