నిజామాబాద్ నగరంలో ఇటీవల వెలుగులోకి వచ్చిన తప్పుడు హామీ పత్రాల (స్యూరిటీ) కేసులో ఇద్దరు వ్యక్తులను టౌన్–I పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులు కోర్టులో హామీ పత్రాలు సమర్పించేటప్పుడు నకిలీ ఆస్తి పత్రాలను సృష్టించి సమర్పించినట్లు దర్యాప్తులో తేలింది.
టౌన్–I ఎస్ హెచ్ ఓ బి. రఘుపతి తెలిపిన వివరాల ప్రకారం, అరెస్ట్ అయిన నిందితులు తమ పేర్లపై లేని ఆస్తులను చూపిస్తూ, నకిలీ గృహ విలువ సర్టిఫికెట్లు, హౌస్ ట్యాక్స్ రసీదులు వంటి పత్రాలను తయారు చేసి కోర్టు మరియు పోలీస్ స్టేషన్లో సమర్పించారు.
విచారణ అనంతరం, కనుకుంట రత్నం (65) మరియు ఖాజా ముజఫ్ఫరుల్లా (60) అనే ఇద్దరిని పోలీసులు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. వీరు నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం వడ్డెపల్లి గ్రామానికి చెందినవారు.
అరెస్ట్ చేసిన నిందితులను గౌరవ న్యాయస్థానం ముందు హాజరుపరచగా, కోర్టు వారిని జుడీషియల్ కస్టడీకి పంపింది.
కోర్టులో తప్పుడు హామీ పత్రాలు సమర్పించడం, నకిలీ పత్రాలు సృష్టించడం తీవ్రమైన నేరాలని, అలాంటి చర్యలకు పాల్పడితే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.


