వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నారనే అనుమానంతో భర్త, అత్తను విషమిచ్చి హత్యాయత్నానికి పాల్పడిన మహిళను ముగ్పాల్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిజామాబాద్ జిల్లా ముదక్పల్లి గ్రామానికి చెందిన పొట్టోళ్ల సోని (33) ఈ ఘాతుకానికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటోంది.
వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నారనే అనుమానంతో భర్త, అత్తను విషమిచ్చి హత్యాయత్నానికి పాల్పడిన మహిళను ముగ్పాల్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిజామాబాద్ జిల్లా ముదక్పల్లి గ్రామానికి చెందిన పొట్టోళ్ల సోని (33) తన భర్త పొట్టోళ్ల భూమన్న, అత్త భూదేవ్వ తమ అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నారని భావించింది. ఈ నేపథ్యంలో వారిని హత్య చేయాలనే ఉద్దేశంతో ఆగస్టు 1న ఇంట్లో వండిన మీల్ మేకర్ కూరలో గడ్డి మందు (వీడిసైడ్) కలిపినట్లు ఆరోపణలు ఉన్నాయి.
అస్వస్థతకు గురైన బాధితులు
మధ్యాహ్న భోజన సమయంలో భూదేవ్వ ఆ కూర తినడంతో తీవ్ర వాంతులు, విరేచనాలతో అస్వస్థతకు గురయ్యారు. అనంతరం అదే కూరను తినేందుకు ప్రయత్నించిన భూమన్నకు పురుగుమందు వాసన రావడంతో అనుమానం వచ్చి వెంటనే భోజనం నిలిపివేశారు. అయినప్పటికీ ఆయనకు తలతిరగడంతో ఇద్దరినీ నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. సకాలంలో వైద్యం అందడంతో ఇద్దరూ ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు.
నిందితురాలి అరెస్ట్
ఘటనపై కేసు నమోదు చేసి నిందితురాలిని అదుపులోకి తీసుకొని విచారించగా, ఆమె నేరాన్ని అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం సోనిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచినట్లు ముగ్పాల్ ఎస్ఐ సుష్మిత వెల్లడించారు. కేసు దర్యాప్తు కొనసాగుతోంది.












