మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని శామీర్‌పేట తహసీల్దార్ కార్యాలయంలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు మంగళవారం ఆకస్మిక దాడులు నిర్వహించారు. 30 ఎకరాల భూ కన్వర్షన్ వ్యవహారంలో రైతు కన్సల్టెంట్ నుంచి భారీ మొత్తంలో లంచం డిమాండ్ చేసినట్లు వచ్చిన ఫిర్యాదుల మేరకు ఈ సోదాలు జరిగినట్లు సమాచారం.
రంగారెడ్డి ఏసీబీ డీఎస్పీ ఆనంద్ కుమార్ నేతృత్వంలో చేపట్టిన ఈ తనిఖీల్లో, శామీర్‌పేట మండలం ఆలియాబాద్ ప్రాంతంలో సుమారు 30 ఎకరాల భూమి కన్వర్షన్‌కు సంబంధించి ఎకరానికి రూ.1 లక్ష చొప్పున మొత్తం రూ.30 లక్షలు డిమాండ్ చేసినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. ఈ క్రమంలో, తహసీల్దార్ డ్రైవర్ ద్వారా రూ.2 లక్షలు తీసుకుంటుండగా అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.
ఏసీబీ అధికారులు కార్యాలయంలోని కీలక పత్రాలు, భూ అనుమతులకు సంబంధించిన రికార్డులను స్వాధీనం చేసుకుని పరిశీలిస్తున్నారు. ఈ కేసులో ఎమ్మార్వో సుచరితతో పాటు ఆర్డీఓ కీసర రాజేష్, పలువురు సిబ్బందిని విచారిస్తున్నట్లు డీఎస్పీ ఆనంద్ కుమార్ మీడియా సమావేశంలో తెలిపారు. పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తామని అధికారులు పేర్కొన్నారు.
గతంలో కూడా ఇదే కార్యాలయంలో అవినీతి చోటుచేసుకుంది. 2024లో, అప్పటి ఎమ్మార్వో సత్యనారాయణ రూ.2 లక్షల లంచం కేసులో డ్రైవర్‌తో కలిసి ఏసీబీకి చిక్కారు. తాజాగా మరోసారి అదే కార్యాలయంలో ఏసీబీ దాడులు జరగడం జిల్లాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.











