నిజామాబాద్, ఆగస్టు 1
మహిళలపై లైంగిక వేధింపులు, లైంగిక దాడి ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన సబ్-ఇన్స్పెక్టర్ కదిరె శ్రీకాంత్ గౌడ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. మూడు నెలలుగా పరారీలో ఉన్న అతడిని నిజామాబాద్‌లో గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.
మహిళలపై లైంగిక వేధింపులు, లైంగిక దాడి ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన సబ్-ఇన్స్పెక్టర్ కదిరె శ్రీకాంత్ గౌడ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. గత మూడు నెలలుగా పోలీసులకు చిక్కకుండా పరారీలో ఉన్న ఆయనను నిజామాబాద్‌లో గుర్తించి అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.
పోలీసుల కథనం ప్రకారం, సోషల్ మీడియా ద్వారా మహిళలతో పరిచయాలు పెంచుకొని వారిని వేధించినట్లు శ్రీకాంత్‌పై ఆరోపణలు ఉన్నాయి. హైదరాబాద్‌కు చెందిన ఓ యువతిని వివాహం చేసుకుంటానని నమ్మించి లైంగిక దాడికి పాల్పడినట్లు వచ్చిన ఫిర్యాదు మేరకు గతంలో జగిత్యాల టౌన్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది.
అదేవిధంగా హనుమకొండలోని సుబేదారి పోలీస్‌స్టేషన్ పరిధిలో మరో మహిళ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కూడా మరో కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ కేసుల నేపథ్యంలో పరారీలో ఉన్న శ్రీకాంత్‌ను నిజామాబాద్‌లో గుర్తించిన సుబేదారి పోలీసులు అదుపులోకి తీసుకొని హనుమకొండకు తరలించారు.
అనంతరం ఆయనను హనుమకొండ మూడో అదనపు న్యాయస్థానం ముందు హాజరుపరచగా, న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించినట్లు పోలీసులు తెలిపారు.












