వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో నిర్వహిస్తున్న శ్రీ సీతారాముల కళ్యాణోత్సవాల్లో భాగంగా మూడవ రోజు పూజా కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో వైభవంగా జరిగాయి.
ఈ సందర్భంగా శ్రీ సీతారాముల స్వామివారికి పంచోపనిషత్తు విధానంలో అభిషేకం, శ్రీ రామచంద్ర స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే శ్రీ రాజరాజేశ్వర స్వామివారికి మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, పరివార దేవతార్చనలు ఘనంగా జరిగాయి.
శ్రీరామ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఆలయ అర్చకులు రామాయణ పారాయణం, శ్రీరామ గీత, ఆధ్యాత్మిక రామాయణ పారాయణాలను ఏకాంతంగా నిర్వహించారు.
సాయంత్రం 4:30 గంటలకు శంకరమఠంలో రామాయణ ప్రవచనం నిర్వహించినట్లు దేవస్థాన అధికారులు తెలిపారు. ఆలయ అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా అర్చకులు, వేద పండితులు దేవస్థానం మరింత అభివృద్ధి చెందాలని ప్రార్థనలు చేశారు.










