సంగారెడ్డి ప్రతినిధి, ఆగస్టు 4 (ప్రశ్న ఆయుధం న్యూస్): జాతీయ నులి పురుగులు నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) చంద్రశేఖర్ అధ్యక్షత, వివిధ శాఖల అధికారులతో జిల్లా టాస్క్ ఫోర్స్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భముగా జిల్లా అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ మాట్లాడుతూ… జాతీయ నులి పురుగులు నివారణ దినోత్సవం ఆగస్టు 11న, మాప్-అప్ డే ఆగస్టు 18న నిర్వహించనున్నట్లు తెలిపారు. జిల్లాలో 1నుండి 19 సంవత్సరాల మధ్య వయసు కలిగిన 406494 మంది పిల్లలకు ఆల్బెండజోల్ 400 మి.గ్రా మాత్రలు పంపిణీ చేయాల్సి ఉందని పేర్కొన్నారు. 1-2 ఏళ్ల పిల్లలకు సగం మాత్ర, 2-3 ఏళ్ల వారికి పొడి చేసి ఒక మాత్ర, 3 సంవత్సరాలు పైబడిన వారికి ఒక మాత్ర నేరుగా మింగించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి పిల్లవాడికీ పాఠశాలలలో, అంగన్వాడి కేంద్రాలలో టీచర్ల సమక్షంలో మాత్రలు మింగేలా చూడాలని అధికారులకు సూచించారు. ఖాళీ కడుపుతో కాకుండా, భోజనం చేసిన తర్వాత మాత్రలు మింగించాలన్నారు. అత్యవసర పరిస్థితుల్లో 108, 104 అంబులెన్స్ సేవలు అందుబాటులో ఉంచాలని అధికారులను ఆదేశించారు . అన్ని లైన్ డిపార్ట్మెంట్లు సమన్వయంతో పనిచేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సూచించారు. ఈ సమావేశంలో ఇంచార్జి జిల్లా వైద్య ఆరోగ్య అధికారిణి డా. నాగనిర్మల, ఇమ్మునైజేషన్ ఇంచార్జి అధికారి డా. శశాంక్, డిప్యూటీ డీఎంహెచ్ఓలు, ప్రోగ్రాం అధికారులతో పాటు ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.
జిల్లాలో వంద శాతం మందుల పంపిణీ చేయాలి: జిల్లా అదనపు కలెక్టర్ చంద్రశేఖర్
Updated On: August 4, 2025 6:05 pm