సంగారెడ్డి జిల్లా ప్రతినిధి, అక్టోబర్ 21 (ప్రశ్న ఆయుధం న్యూస్): మంజీరా తీరాన పర్యాటక అడ్వెంచర్ హబ్ ప్రాజెక్టు పనులు ప్రారంభించేందుకు చర్యలు చేపట్టాలని అధికారులను జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో మంజీరా నది తీరాన అభివృద్ధి చెందనున్న పర్యాటక అడ్వెంచర్ హబ్ ప్రాజెక్టు పనులపై కలెక్టర్ అధ్యక్షతన పంచాయతీ రాజ్ శాఖ, విద్యుత్ శాఖ, అటవీ శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ క్రమంలో మౌంట్ ఎవరెస్టు అధిరోహకులు, ట్రాన్సుసెంట్ అకాడమీ అప్ రాక్ క్లైంబింగ్ సంస్థ నిపుణులు పి అన్విత, ఎస్ ఆనంద్ కుమార్, పూర్ణ, మంజీరా డ్యామ్ పై సాహస క్రీడలు(అడ్వాంచర్) పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. మంజీరా డ్యామ్ ను సాహస క్రీడల కేంద్రంగా తీర్చిదిద్దెందుకు గల అవకాశాలను వారు వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లా స్థాయిలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి పరచడానికి మంజీరా నది తీరంలో ఉన్న ప్రకృతి వైభవాన్ని వినియోగించుకోవడం ఎంతో అవసరమని పేర్కొన్నారు. అడ్వెంచర్ హబ్ ద్వారా జల క్రీడలు, బోటింగ్, క్యాంపింగ్, ట్రెక్కింగ్ వంటి కార్యకలాపాలు ప్రారంభమైతే జిల్లా పర్యాటకులకు కొత్త ఆకర్షణగా మారుతుందని తెలిపారు. మంజీరా తీరాన అవసరమైన మౌలిక వసతులైన రహదారి, విద్యుత్ కనెక్షన్, నీటి సరఫరా, భద్రతా ఏర్పాట్లపై సమగ్ర నివేదిక సిద్ధం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రాజెక్టు రూపకల్పనలో పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలని, సహజ వనరులపై ప్రభావం లేకుండా నిర్మాణాలు చేపట్టాలని సూచించారు. తదుపరి దశలో ప్రాజెక్ట్ అమలుకు సంబంధించిన సాంకేతిక ప్రణాళికను సిద్ధం చేసి ప్రభుత్వానికి సమర్పించాలని, స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేలా ప్రణాళిక ఉండాలని కలెక్టర్ ఆదేశించారు. మంజీరా అడ్వెంచర్ హబ్ పూర్తి స్థాయిలో అమలు చేయబడితే, సంగారెడ్డి జిల్లాలో పర్యాటక అభివృద్ధికి నూతన దశ ఆరంభమవుతుందని కలెక్టర్ విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రాజెక్టు స్థలాన్ని స్వయంగా పరిశీలించేందుకు అధికారులను ఆదేశించారు. పంచాయతీ రాజ్ శాఖ అసిస్టెంట్ ఇంజనీరింగ్ అధికారులు, విద్యుత్ శాఖ డివిజనల్ ఇంజనీర్లు తదితర అధికారులు ప్రాజెక్టు స్థలాన్ని సందర్శించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అటవీశాఖ అధికారి శ్రీధర్ రావు, పంచాయతీ రాజ్ శాఖ అధికారులు, విద్యుత్ శాఖ అధికారులు సంబంధిత అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
మంజీరా తీరాన పర్యాటక అడ్వెంచర్ హబ్ ప్రాజెక్టు పనులు ప్రారంభించేందుకు చర్యలు చేపట్టాలి: జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య
Published On: October 21, 2025 8:27 pm