దివ్యాంగులు ప్రభుత్వ తోడ్పాటును సద్వినియోగం చేసుకోవాలి: జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య

సంగారెడ్డి జిల్లా ప్రతినిధి, డిసెంబర్ 3 (ప్రశ్న ఆయుధం న్యూస్): దివ్యాంగులు ప్రభుత్వ తోడ్పాటును సద్వినియోగం చేసుకుంటూ అన్ని రంగాలలో విజయాలను సాధించాలని జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య అన్నారు. జిల్లా మహిళా, శిశు, దివ్యాంగుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బుధవారం కలెక్టరేట్లోని ఆడిటోరియంలో అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవ వేడుకను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన కలెక్టర్ మాట్లాడుతూ.. దివ్యాంగులు ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయాలని, అప్పుడే వారు అనుకున్నది సాధించగలుగుతారన్నారు. అన్ని రంగాలలో దివ్యాంగులు సమాజంలోని సకలాంగులకు ఎంతమాత్రం తీసిపోకుండా తమ ప్రతిభను చాటుతున్నారని పేర్కొన్నారు. దివ్యాంగులు సంతోషంగా సమాజానికి స్ఫూర్తిదాయకంగా ఉండాలని సూచించారు. దివ్యాంగుల కోసం ప్రభుత్వం పలు కార్యక్రమాలను అమలు చేస్తోందన్నారు.జిల్లాలో దివ్యాంగుల పిల్లల కోసం ఐఆర్సి సెంటర్ను ఏర్పాటు చేశామని, అన్ని వసతులతో తీర్చిదిద్దుతున్నామని వివరించారు. ఎస్హెచ్ఈ ద్వారా పీడబ్ల్యుడి గ్రూప్స్ ఏర్పాటు చేశామని తెలిపారు. దివ్యాంగులకు జిల్లా యంత్రాంగం తరపున పూర్తి సహాయ సహకారం అందిస్తామని అన్నారు. జిల్లా స్థాయి కమిటీ సమావేశం రెగ్యులర్ గా ప్రతి క్వార్టర్ నిర్వహించేలా చర్యలు చేపట్టాలని డీడబ్ల్యూఓ లలిత కుమారికి సూచించారు. అనంతరం అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం పురస్కరించుకుని నిర్వహించిన క్రీడా పోటీలలో గెలుపొందిన విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. ఆయా క్రీడలలో ప్రథమ స్థానంలో గెలుపొందిన విజేతలకు వెయ్యి రూపాయల చొప్పున నగదు బహుమతిని అందజేశారు. అంతకు ముందు దివ్యాంగుల సంక్షేమ సంఘాల ప్రతినిధులు పలు సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. ఆయా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని కలెక్టర్ చెప్పారు. ఈ కార్యక్రమంలో డీడబ్ల్యుఓ లలిత కుమారి, లీగల్ సర్వీసెస్ అథారిటీ సెక్రటరీ సౌజన్య, సిడిపిఓలు, దివ్యాంగుల సంక్షేమ సంఘం ప్రతినిధులు ప్రవీణ్, జుబేదా, స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులు, దివ్యాంగులు తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment