సంగారెడ్డి ప్రతినిధి, మే 3 (ప్రశ్న ఆయుధం న్యూస్): వేసవి ఉష్ణోగ్రతలు రోజు రోజుకీ పెరుగుతుండడంతో, వడదెబ్బ (హీట్ స్ట్రోక్) ప్రమాదం కూడా పెరుగుతున్నదని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి పేర్కొన్నారు. అధిక ఉష్ణోగ్రతల మధ్య ప్రజలు అనారోగ్యానికి గురి కాకుండా జాగ్రత్తలు పాటించడం అత్యవసరమని కలెక్టర్ సూచించారు. వడదెబ్బ ప్రభావానికి బయట పని చేసే ప్రజలతో పాటు ఇంట్లో ఉండే వృద్ధులు, చిన్నారులు కూడా లోనవుతారని పేర్కొన్నారు. తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే వడదెబ్బ ప్రాణాపాయంగా మారే అవకాశముందని కలెక్టర్ హెచ్చరించారు.చల్లటి నీరు, ఓఆర్ఎస్ ద్రావణం, పండ్ల రసాలు వంటి ద్రవ పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలని, ఎండలో ఎక్కువసేపు ఉండకూడదని, టోపీ, గొడుగు వాడటం, చక్కటి రంగుల సున్నితమైన దుస్తులు ధరించడం మంచిదన్నారు. మధ్యాహ్న వేళ బయటకు వెళ్లవద్దని, ఎండ తీవ్రంగా ఉండే మధ్యాహ్న సమయంలో బయటకు వెళ్లకూడదన్నారు. అత్యవసరంగా వెలితే తగిన జాగ్రత్తలు తీసుకోవాలనీ పేర్కొన్నారు. తలనొప్పి, వాంతులు, మైకము, అధిక జ్వరం, స్పృహ కోల్పోవడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్య సహాయం తీసుకోవాలనీ,పిల్లలు మరియు వృద్ధులకు ప్రత్యేక శ్రద్ధ అవసరం అని,ఈ వర్గాల వారు ఎండలో ఉండకూడదన్నారు. వీలైనంత వరకు ఇంట్లోనే ఉంచడం మంచిదనీ సూచించారు. విశేషంగా మందులు తీసుకుంటున్న వారు డాక్టర్ సూచనల మేరకు వాటిని తీసుకోవాలన్నారు. జిల్లాలోని ప్రజలు సూచనలను పాటిస్తే, వేసవిలో వడదెబ్బ వంటి సమస్యలను నివారించవచ్చని తెలిపారు.
వేసవిలో వడదెబ్బకు జాగ్రతలు పాటించాలి: జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి
Published On: May 3, 2025 8:33 pm