సంగారెడ్డి ప్రతినిధి, ఫిబ్రవరి 22 (ప్రశ్న ఆయుధం న్యూస్): సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం మండల పరిధిలోని వెలిమెల మోడల్ స్కూల్, జూనియర్ కళాశాల, ఉస్మాన్ నగర్ కస్తూర్భా గాంధీ బాలికల పాఠశాలను శనివారం జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాలల్లో వంట గదిని డైనింగ్ హాల్ను, స్టోర్ రూమ్ లో పరిశీలించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఉపాధ్యాయులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. విద్యార్థులకు నూతన మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని నిర్వాహకులకు సూచించారు. నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ పిల్లలకు రుచికరమైన వంట వండి పెట్టాలని ఆదేశించారు. పాఠశాలలో సానిటేషన్ సమస్య తలెత్తకుండా అవసరమైన ముందు జాగ్రత్తగా చర్యలు తీసుకోవాలన్నారు. పదవ తరగతి పరీక్షలకు సమయం దగ్గర పడుతున్నందున విద్యార్థులు శ్రద్ధతో చదివి మెరుగైన ఫలితాలు సాధించాలని సూచించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో మాట్లాడి వారి నైపుణ్యాలను పరిశీలించారు. పరీక్షలు రాసే విధానంపై విద్యార్థులకు పలు సూచనలు అందించారు. విద్యార్థులకు మెరుగైన వసతితో పాటు నాణ్యమైన భోజనం అందించాలని, ప్రత్యేక తరగతులు నిర్వహించి పదో తరగతిలో మెరుగైన ఫలితాలు 10/10 సాధన కోసం ఉపాధ్యాయులు కృషి చేయాలని సూచించారు. ఈ తనిఖీలో కలెక్టర్ వెంట డీఈవో వెంకటేశ్వర్లు, కళాశాల ఉపాధ్యాయులు సంబంధిత అధికారులు ఉన్నారు.