సంగారెడ్డి ప్రతినిధి, ఆగస్టు 2 (ప్రశ్న ఆయుధం న్యూస్): స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమం విజయవంతం కోసం అధికారులు చిత్తశుద్ధితో పని చేయాలని జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతి అన్నారు. ఈ నెల 5 నుండి 9వ తేదీ వరకు కొనసాగనున్న ‘స్వచ్ఛదనం – పచ్చదనం’ కార్యక్రమం నిర్వహణలో నిర్లక్ష్యానికి తావిస్తే, బాధ్యులపై కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ క్రాంతి అన్నారు. వివిధ శాఖల అధికారులు, క్షేత్ర స్థాయి సిబ్బంది అందరూ పరస్పరం సమన్వయంతో పని చేస్తూ జిల్లాలో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం నుండి శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్ అన్ని మండలాల స్పెషల్ ఆఫీసర్లు, ఆర్డీఓలు, తహసీల్దార్లు, ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లు, గ్రామ పంచాయతీల ప్రత్యేక అధికారులు, ఏ.పీ.ఎంలు, పంచాయతీ కార్యదర్శులతో స్వచ్ఛదనం-పచ్చదనంపై సమీక్ష నిర్వహించారు. అన్ని గ్రామ పంచాయతీలు, మున్సిపల్ పట్టణాలలోని వార్డులలో ఐదు రోజుల పాటు చేపట్టాల్సిన కార్యక్రమాల గురించి తెలియజేశారు. గ్రామ పంచాయతీ స్పెషల్ ఆఫీసర్, కార్యదర్శి, ఆశా కార్యకర్త, వీ.ఓలతో కమిటీని ఏర్పాటు చేసుకుని నిర్దేశిత కార్యక్రమాలు పకడ్బందీగా అమలు చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గ్రామంలోని ఆసక్తి గల యువతను, పాఠశాలల హెచ్.ఎంలు, మెడికల్ ఆఫీసర్లను కూడా కమిటీలో ప్రాతినిధ్యం కల్పించవచ్చని సూచించారు. తక్షణమే కమిటీలను ఏర్పాటు చేసుకుని, మండల ప్రత్యేక అధికారుల సమక్షంలో సమావేశాన్ని నిర్వహించి స్పష్టమైన కార్యాచరణను రూపొందించుకోవాలని అధికారులకు సూచించారు. స్వచ్ఛదనం-పచ్చదనం అత్యంత ప్రాధాన్యతతో కూడుకున్నందున అధికారులు మొదలుకుని క్షేత్రస్థాయి సిబ్బంది వరకు ప్రతిఒక్కరూ అంకితభావంతో పని చేయాలని, అత్యవసరమైతే తప్ప ఎవరూ సెలవులు పెట్టకూడదని కలెక్టర్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. తనతో పాటు ఇతర జిల్లా స్థాయి అధికారులు ఆకస్మికంగా సందర్శించిన సమయాలలో ఎక్కడైనా నిర్వహణపరంగా లోపాలు ఉంటే, సంబంధిత అధికారులు, సిబ్బందిని బాధ్యులుగా పరిగణించి చర్యలు తీసుకుంటామని అన్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన నివేదికలను రోజువారీగా సమర్పించాలని ఆదేశించారు. ముఖ్యంగా వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలేందుకు ఎక్కువగా ఆస్కారం ఉన్నందున పారిశుధ్యం పనులపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని హితవు పలికారు. అదేవిధంగా తాగునీటి సరఫరా వ్యవస్థను నిశితంగా పర్యవేక్షణ జరపాలని సూచించారు. సీజనల్ వ్యాధులు సోకకుండా ముందస్తు జాగ్రత్తలు చేపట్టాలని, ఎక్కడైనా మలేరియా, డెంగ్యూ వంటి కేసులు నమోదైతే తక్షణమే స్పందిస్తూ యుద్ధప్రాతిపదికన నియంత్రణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. స్వచ్ఛదనం-పచ్చదనం కార్యక్రమం ముగిసిన అనంతరం కూడా శానిటేషన్, వాటర్ సప్లై తీరుతెన్నులపై ప్రత్యేక దృష్టి సారిస్తూ, మరో రెండు మూడు నెలలపాటు అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు వీలుగా అందరినీ భాగస్వాములు చేస్తూ స్వచ్ఛదనం-పచ్చదనం కార్యక్రమం ప్రారంభం రోజున ఎక్కడికక్కడ ర్యాలీలు నిర్వహించాలని తెలిపారు. పాఠశాలలు, కళాశాలలు, రెసిడెన్షియల్ స్కూల్స్ విద్యార్థులకు వ్యాసరచన వంటి పోటీలు ఏర్పాటు చేయాలని అన్నారు. పల్లె ప్రకృతి వనాలు, బృహత్ పల్లె ప్రకృతి వనాలు, సంపద వనాలు, వైకుంఠధామాలు, డంపింగ్ యార్డులను సందర్శించి పచ్చదనం పెంపొందేలా విరివిగా మొక్కలు నాటాలని, ఎక్కడైనా మొక్కలు చనిపోతే, వాటి స్థానంలో కొత్త మొక్కలు నాటాలని సూచించారు. కెనాల బండ్ ప్లానిటేషన్ ఏర్పాటు లో కలువగట్టు పక్కల ఈత మొక్కలు నాటాలని అన్నారు. పాఠశాలలు, వసతి గృహాలు, ఆరోగ్య కేంద్రాలు, అంగన్వాడీ సెంటర్లు తదితర చోట్ల పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని, వాటి ఆవరణలు, ఖాళీ ప్రదేశాలలో మొక్కలు నాటి వనమహోత్సవం లక్ష్య సాధనకు చిత్తశుద్ధితో కృషి చేయాలని అన్నారు. పశు సంవర్ధక శాఖ అధికారులు గ్రామాలు మున్సిపాలిటీలో ఉన్న వీధి కుక్కల వివరాలను వచ్చే శాఖ అధికారులు నీటి గుంటలలో దోమలు ఎదురకుండా గాంబోడియా ఫిష్ లను వదలాలని ఆయిల్ బాల్స్ వేయాలని అధికారులకు సూచించారు వర్షాల వల్ల వ్యాధులు ప్రభువుల అవకాశాలు ఉన్నందున అవసరమైన పరిసరాల పరిశుభ్రత సానిటేషన్ సమస్యలతో తప్పకుండా తాగునీరు కలుషితం కాకుండా అధికారులు క్రమం తప్పకుండా పర్యవేక్షించాలని కలెక్టర్ గ్రామాలలో వ్యక్తిగత మరియు దుట్ల సర్వే నిర్వహించాలని అవసరమైన వారికి నూతన మరుగుదొడ్ల నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులకు వర్షాకాలంలో పాడుబడిన ఇండ్లలో ప్రజలు ఉండకుండా చూడాలని వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని చెరువులు, కుంటలు కట్టలు తెగే అవకాశం ఉన్న వాటిని గుర్తించి అవసరమైన మరమత్తు పనులు చేపట్టాలని నీటిపారుదల శాఖ అధికారులకు సూచించారు. మంచి నీటి ట్యాంకులను శుభ్రం చేయించి, క్లోరినేషన్ జరిపించాలని, నివాస ప్రాంతాల నడుమ మురుగు నీరు, వర్షపు నీరు నిలువ ఉండకుండా చూడాలన్నారు. స్వచ్ఛదనం-పచ్చదనం నిర్వహణలో ఎంపీడీఓలు, తహసీల్దార్లు, ఎంపీఓలు క్రియాశీలకపాత్ర పోషించాలని, మండల ప్రత్యేక అధికారులు, ఆర్డీఓలు, మున్సిపల్ కమిషనర్లు నిశిత పర్యవేక్షణ జరపాలని కలెక్టర్ ఆదేశించారు. స్వయం సహాయక సంఘాల మహిళలను, స్థానిక నాయకులను, యువజన సంఘాలను భాగస్వాములు చేస్తూ పంచాయతీ కార్యదర్శులు, ఆశా వర్కర్లు, ఆరోగ్య కార్యకర్తలు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, వివిధ వర్గాల వారందరు స్వచ్ఛదనం – పచ్చదనంలో పాలుపంచుకుని జిల్లా వ్యాప్తంగా అన్ని చోట్ల ఈ కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో విజయవంతం చేసేలా కృషి చేయాలని సూచించారు. వీడియో కాన్ఫరెన్స్ లో స్థానిక సంస్థల అదనపు చంద్రశేఖర్, ట్రై నీ కలెక్టర్ మనోజ్, డిపిఓ సాయిబాబా, జడ్పీసీఈఓ జానకి రెడ్డి, డీ ఎం అండ్ హెచ్ఓ గాయత్రీదేవి, డీఈఓ వెంకటేశ్వర్లు, జిల్లా సంక్షేమధికారిణి లలిత కుమారి, సిపిఓ బాలశౌరి, వివిధ శాఖల సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
స్వచ్ఛదనం-పచ్చదనం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి: జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి
Updated On: August 2, 2024 7:47 pm