సంగారెడ్డి జిల్లా ప్రతినిధి, అక్టోబర్ 10 (ప్రశ్న ఆయుధం న్యూస్): జాతీయ న్యాయ సేవాధికార సంస్థ, రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి భవానిచంద్ర మార్గదర్శకత్వంలో సమాజంలోని బలహీన వర్గాలకు ఉచిత న్యాయ సహాయం అందించడమే లక్ష్యంగా జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ, సంగారెడ్డి ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆసుపత్రి, సంగారెడ్డిలోని డీ-అడిక్షన్ / రెహాబిలిటేషన్ సెంటర్ వద్ద “లీగల్ ఎయిడ్ క్లినిక్ ను జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి బి.సౌజన్య ప్రారంభించారు. ఈ సందర్భంగా సీనియర్ సివిల్ జడ్జి బి.సౌజన్య మాట్లాడుతూ.. ప్రతి వ్యక్తికి న్యాయ సేవలను అందించడం మా ప్రధాన బాధ్యత అని, ఈ లీగల్ ఎయిడ్ క్లినిక్ ద్వారా మాదకద్రవ్య వ్యసనానికి గురైన వ్యక్తులు, వారి కుటుంబ సభ్యులు, పునరావాసం పొందుతున్న రోగులు చట్టపరమైన సలహాలు, మార్గదర్శకత్వం అవసరమైతే ఉచిత న్యాయ సహాయం పొందవచ్చని పేర్కొన్నారు. ఈ క్లినిక్ ద్వారా కుటుంబ, ఆస్తి, ఉద్యోగం, గృహహింస, పునరావాసం తదితర చట్టపరమైన సమస్యల పరిష్కారం కోసం సహాయం అందిస్తారని తెలిపారు. ప్రతి శనివారం ఒక ప్యానల్ లాయర్ మరియు ఒక పారా లీగల్ వాలంటీర్ (పీఎల్ వీ) విధుల్లో ఉండేలా ఏర్పాట్లు చేశారు. ఈ సేవలు పూర్తిగా ఉచితంగా అందుబాటులో ఉంటాయని ఆమె తెలిపారు. ఆసుపత్రిలోని రోగులు, వారి బంధువులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య, ఆరోగ్య అధికారి నాగ నిర్మల, డాక్టర్ శశాంక్, ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ మురళీకృష్ణ, ఆర్‌ఎమ్‌ఓ బాలస్వామి, అడ్వకేట్ ఎం.డి. ఖాలేద్, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
లీగల్ ఎయిడ్ క్లినిక్ ను ప్రారంభించిన జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ కార్యదర్శి బి.సౌజన్య
Published On: October 10, 2025 1:20 pm