సంగారెడ్డి జిల్లా ప్రతినిధి, అక్టోబర్ 22 (ప్రశ్న ఆయుధం న్యూస్): ప్రజల భద్రత కోసం అహర్నిశలు కృషి చేసే సిబ్బంది ఆరోగ్య పరిరక్షణ మా ప్రథమ కర్తవ్యం అని జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ అన్నారు. బుధవారం జిల్లా పోలీసు, ఐ.యం.ఏ (ఇండియన్ మెడికల్ అసోసియేషన్) ఆధ్వర్యంలో సమగ్ర ఆరోగ్య శిబిరంను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంత్రి దామోదర్ రాజానర్సింహా, టిజిఐఐసి చైర్ పర్సన్ నిర్మలాజగ్గారెడ్డి, జిల్లా కలెక్టర్ ప్రావీణ్యలు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. నిత్యం ప్రజల శ్రేయస్సు, శాంతి భద్రతల పరిరక్షణ కోసం అహర్నిశలు కృషి చేస్తూ.. విధి నిర్వహణలో ఎదుర్కొనే పని ఒత్తిడి, శారీరక-మానసిక భారం, సమయానికి భోజనం మరియు విశ్రాంతి లేకపోవడం వంటి సమస్యలు సిబ్బంది ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తున్నాయని, ఈ నేపథ్యంలో పోలీస్ సిబ్బంది, వారి కుటుంబ సభ్యుల ఆరోగ్య పరిరక్షణ అత్యంత ముఖ్యమని భావించి, ఐ.యం.ఏ (ఇండియన్ మెడికల్ అసోసియేషన్) ఆధ్వర్యంలో సమగ్ర ఆరోగ్య శిబిరం ను ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. ఈ శిబిరంలో సాధారణ వైద్య పరీక్షలతో పాటు కంటి, దంత, హృదయ, మధుమేహం, రక్తపోటు, ఇతర విభాగాలకు చెందిన సుమారు 80 – మంది నిష్ణాతులైన వైద్యులు పాల్గొని పోలీస్ సిబ్బందికి పూర్తి స్థాయి ఆరోగ్య సేవలు అందించడం జరుగుతుందని, ప్రతి పోలీస్ సిబ్బందికి ఒక ఫైల్ మెయింటైన్ చేస్తూ.. తరుచూ వారి ఆరోగ్యానికి సంబంధించిన సమాచారం ఆన్లైన్లో నమోదు చేయడం జరుగుతుందని తెలిపారు. ధీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న సిబ్బందికి మెరుగైన వైద్య సేవలు అందించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని, సిబ్బంది ఆరోగ్యంగా, ఉత్సాహంగా ఉన్నప్పుడే ప్రజలకు మరింత మెరుగైన సేవలను అందించగలరని, ఇలాంటి ఆరోగ్య శిబిరాలను భవిష్యత్తులో కూడా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటామని అన్నారు. అనంతరం మంత్రి దామోదర రాజనర్సింహ మాట్లాడుతూ.. పోలీసు సిబ్బంది ఆరోగ్య పరిరక్షణకై మెడికల్ క్యాంపు నిర్వహించడం మంచి ఆలోచన అని, నిరంతరం ప్రజల సమస్యలతో పోరాడే పోలీసు సిబ్బంది ఆరోగ్య విషయమై ఇండియన్ మెడికల్ అసోసియేషన్, ఇండియన్ డెంటల్ అసోసియేషన్ సౌజన్యంతో ఈ సమగ్ర ఆరోగ్య శిబిరం నిర్వహించడం అభినందనీయం అన్నారు. 24*7 విధి నిర్వహణలో నిమాగ్నమయ్యే పోలీసుల ఆరోగ్య పరిరక్షణ అందరి బాధ్యత అని అన్నారు. ఈ కార్యక్రమంలో డీఎంఅండ్ హెచ్.ఓ నాగనిర్మలా, ఐ.యం.ఏ సంగారెడ్డి అధ్యక్షుడు కె.కిరణ్ కుమార్, జిల్లా గ్రంధాలయ చైర్మన్ అంజయ్య, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ డా.ఆనంద్, డా.రాజుగౌడ్, డా.శ్రీహరి, అదనపు.ఎస్పీ రఘునందన్ రావు, అదనపు ఎస్పీ శ్రీనివాస్ రావు, ఇతర వైద్యులు, జిల్లా పోలీసులు, వారి కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
ప్రజల భద్రత కోసం అహర్నిశలు కృషి చేసే సిబ్బంది ఆరోగ్య పరిరక్షణ మా ప్రథమ కర్తవ్యం: జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్
Published On: October 22, 2025 7:29 pm