సంగారెడ్డి జిల్లా ప్రతినిధి, డిసై 30 (ప్రశ్న ఆయుధం న్యూస్): నూతన సంవత్సర వేడుకల పేరుతో సామాన్య ప్రజానికానికి, శాంతి భద్రతలకు విఘాతం కలిగించడాన్ని తీవ్రంగా పరిగణించడం జరుగుతుందని జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ పేర్కొన్నారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ.. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా సంతోషాల నడుమ నూతన సంవత్సర వేడుకలు నిర్వహించుకోవాలని ప్రజలకు సూచించారు. డిసెంబర్-31 వేడుకలకు సంబంధించి, ఎలాంటి అక్రమ మద్యం రవాణా జరగకుండా ఇప్పటికే వాహనాల తనిఖీలు ప్రారంభించడం జరిగిందని, డిసెంబర్ -31 రోజు సాయంత్రం నుండే పోలీస్ బృందాలు విస్తృత స్థాయిలో పెట్రోలింగ్ నిర్వహిస్తూ, డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలను ముమ్మరం చేస్తాయని అన్నారు. పట్టణ ప్రాంతాలు మొదలుకొని గ్రామీణ ప్రాంతాల రోడ్లపై తనిఖీలు ఉంటాయని, మద్యం సేవించి, వాహనాలు నడిపేవారిపై కేసు నమోదు చేసి జైలుకు పంపించడం జరుగుతుందని అన్నారు. ముఖ్యంగా మైనర్లకు వాహనాలు ఇవ్వొద్దని, ఈ విషయాల్లో తల్లిదండ్రులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. మైనర్లు వాహనాలు నడిపితే సంబందిత వాహన యజమాని, కుటుంబ సభ్యులపై కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. నూతన సంవత్సర వేడుకలకు, పార్టీలకు, డీజేలకు ఎలాంటి అనుమతులు లేవని, పెద్ద శబ్ధాలతో కూడిన డీజేలు, మైకులు ఏర్పాటు చేస్తే డీజేలను సీజ్ చేసి, సంబధిత వ్యక్తులపై చట్టరిత్య చర్యలు తీసుకోవడం జరుగతుందని పేర్కొన్నారు. ఈ వేడుకుల సందర్భంగా నిర్వహించుకునే ఎలాంటి కార్యక్రమాలైన తప్పని సరిగా పోలీసు అధికారుల నుండి ముందస్తూ అనుమతులు తీసుకోవాలని, అలాగే ప్రజలను ఇబ్బందులకు గురి చేసే విధంగా నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించే వ్యక్తులపై చట్ట రిత్య కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఎస్పీ తెలియజేశారు.
జిల్లా ప్రజలకు పోలీసు వారి సూచనలు..
*జిల్లా వ్యాప్తంగా 30, 30a పోలీసు యాక్ట్ అమలులో ఉందని, పోలీసుల ముందస్తు అనుమతిలేనిది, ఎలాంటి సభలు, సమావేశాలు, నైట్ పార్టీలు నిర్వహించరాదు.
*డిసెంబర్ 31 అర్థ రాత్రి పెద్ద శబ్దాలతో కూడిన డీజేలు వినియోగించి ఇతరులను ఇబ్బందులకు గురిచేయరాదు.
*జిల్లా వ్యాప్తంగా డీజేలు వినియోగించడం నిషేధం అని, నిబంధనలు విరుద్ధంగా డీజేలు వినియోగిస్తే డీజేలు సీజ్ చేసి, కేసులు నమోదు చేయడం జరుగుతుంది.
*మద్యం మత్తులో వాహనాలు నడపడం నేరం, వాహనాలు ఇష్టానుసారంగా వేగంగా, సౌండ్స్ చేస్తూ నడిపితే కేసులు నమోదు చేయడం జరుగుతుంది.
*మైనర్ డ్రైవింగ్, ర్యాష్ డ్రైవింగ్, బైక్ రేసింగ్, త్రిబుల్ రైడింగ్, సైలెన్సర్ లను తీసివేసి వాహనాలు నడపడం, శబ్ద కాలుష్యం చేస్తూ ఇతరులను ఇబ్బంది పెడితే అట్టి వ్యక్తులపై చట్ట రిత్య కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది.
*న్యూఇయర్ వేడుకలలో నిషేదిత డ్రగ్స్, గంజాయి వంటి ఇతర మత్తు పదార్థాలు విక్రయించిన, వినియోగించిన కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది.
*మద్యం దుకాణాలను నిర్ణీత సమయంలో క్లోజ్ చేయాలి, మైనర్లకు మద్యం అమ్మితే షాప్ యాజమానులపై కేసు నమోదు చేయడం జరుగుతుంది.
*బహిరంగ ప్రదేశాల్లో, ప్రభుత్వ స్థలాల్లో మద్యం సేవిసేవించకూడదు. పైన తెలుపబడిన సూచనలను ఎవరైన ఉల్లంఘించినట్లుగా ప్రజల దృష్టికి వస్తే వెంటనే డయల్ 100 లేదా పోలీస్ కంట్రోల్ నెంబర్ 8712656739 కు సమాచారం అందించాలని సూచించారు. నూతన సంవత్సర వేడుకలను ప్రజలు, యువత తమ ఇండ్లలోనే తమ కుటుంబ సభ్యులతో కలిసి సంతోషకరమైన వాతరణంలో నిర్వహించుకోవాలని సూచించారు. గడిచిన సంవత్సరానికి వీడ్కోలు చెపుతూ.. నూతన ఆశయాలతో కొత్త సంవత్సరానికి ఆహ్వానం పలుకుతూ.. ఆనందోత్సాహాలతో, తగిన జాగ్రత్తలతో నూతన సంవత్సర వేడుకలను జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ సంగారెడ్డి జిల్లా ప్రజలకు ముందస్తుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు.