డైట్ ను ప్రక్షాళన చేయరా..?
డైట్ వ్యవహారం అధికారుల మౌనం ఎందుకు..?
విద్యా శిక్షణ కేంద్రంగా దేశానికి ఉపాధ్యాయులను తయారు చేసే కీలక సంస్థ. కానీ ఈ కేంద్రంలో కొనసాగుతున్న పాలన, ప్రిన్సిపల్ తీరుపై పెద్ద ఎత్తున ఆరోపణలు వెల్లువెత్తుతున్నా అధికారులు మాత్రం మౌనంగా వ్యవహరిస్తుండడం పలు అనుమానాలకు తావిస్తోంది.
గత కొన్ని సంవత్సరాలుగా ప్రిన్సిపల్ పై అనేక ఫిర్యాదులు వచ్చినా, చర్యలు తీసుకోవడంలో అధికారులు చూపుతున్న నిస్సహాయత ప్రభుత్వ పరిపాలనపై ప్రశ్నలు కలిగిస్తోంది. జిల్లా పరిపాలనాధికారులకు, స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ కార్యాలయానికి ఫిర్యాదుల పరంపర కొనసాగుతున్నా సంబంధిత వివరాలు కోరిన ఫైలు పై స్పందన లేకపోవడం అనేక అనుమానాలను రేకెత్తిస్తోంది.
ఫీజుల అక్రమ వసూళ్లు, డిప్యూటేషన్ దుర్వినియోగం..?
2021-22లో ఫీజుల్ని గూగుల్ పే, ఫోన్ పే వంటి మార్గాల్లో వసూలు చేశారనే ఆరోపణలపై దర్యాప్తు జరిపితే పెద్ద ఎత్తున అవకతవకలు బయటపడే అవకాశం ఉందని విద్యార్థులు చెబుతున్నారు. అంతేకాదు, రుద్రూర్, నీలా ప్రాంతాల నుండి డిప్యూటేషన్ మీద తీసుకున్న బయో సైన్స్, ఫిజికల్ సైన్స్ ఉపాధ్యాయులు బోధన జరపకుండా వ్యక్తిగత పనులకే ఎక్కువ సమయం కేటాయిస్తున్నారని విద్యార్థులు ఆరోపిస్తున్నారు.
అదే సమయంలో నిజామాబాద్ డైట్‌కు వచ్చిన ఉపాధ్యాయులు తగిన పనులు చేయకుండానే జీతాలు తీసుకుంటున్న దాఖలాలు వెలుగులోకి వస్తున్నాయి. ఒక ఉపాధ్యాయుడు సెలవుల్లో ఉన్నా పూర్తి జీతం అందుకున్నాడంటే, జవాబుదారితనం ఎక్కడన్న ప్రశ్న తలెత్తుతోంది. ఇదే సమయంలో బోధన్ ప్రాంతానికి చెందినవారిని డిప్యూటేషన్ పై డైట్‌కు తీసుకురావడంలోనూ ప్రయోజనాలు లేవా అనే చర్చలు మొదలయ్యాయి.
పాత వారు తప్ప, కొత్త వారు నిష్క్రమణ..!!
గతంలో అనుభవం కలిగిన లెక్చరర్లను తప్పించి వారి స్థానాల్లో సామర్థ్యం లేని వారిని నియమించడం వల్ల విద్యా నాణ్యత క్షీణించిందని విద్యార్థుల వాదన. కొత్తగా నియమితమైన వ్యాయామ ఉపాధ్యాయుడు ఒక్కసారైనా శిక్షణ కార్యక్రమం నిర్వహించకపోవడం గమనార్హం.
ఈ.ఎల్. టీ. సి లో పరిస్థితి దారుణం..?
ఇంగ్లీష్ లాంగ్వేజ్ ట్రైనింగ్ సెంటర్ లో ముగ్గురు ఉపాధ్యాయులలో కేవలం ఒకరే పనిచేస్తున్నారన్న ఆరోపణలు నిజమైతే, ప్రభుత్వ నిధుల వృథాగా చెప్పకతప్పదు.
మొత్తంగా చూస్తే, డైట్ ప్రిన్సిపల్ తీరుపై తీవ్ర అసంతృప్తి ఉంది. విద్యార్థులు, సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నా అధికారులు మాత్రం స్పందించకపోవడం వల్ల, ఈ వ్యవస్థపై ప్రజలు నమ్మకం కోల్పోతున్న పరిస్థితి నెలకొంది. ఒకవేళ ఇప్పటికైనా చర్యలు తీసుకోకపోతే, ప్రభుత్వ విద్యా శిక్షణ రంగానికి దీర్ఘకాల నష్టం వాటిల్లనుంది.