భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని సంగారెడ్డిలోని గిరిజన బాలుర న్యాయ కళాశాలలో న్యాయ అవగాహన సదస్సు జరిగింది. ఈ సదస్సుకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి. సౌజన్య ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు న్యాయ సూత్రాలపై అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమంలో బి. సౌజన్య మాట్లాడుతూ, డాక్టర్ అంబేద్కర్ అందించిన సమానత్వం, స్వేచ్ఛ, న్యాయం వంటి మూల సూత్రాలను ఆదర్శంగా తీసుకోవాలని విద్యార్థులకు సూచించారు. విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని, బాలల సంక్షేమంపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆమె కోరారు.
విద్యార్థులు వివిధ చట్టాలపై అవగాహన కలిగి ఉండటం ఎంతో ముఖ్యమని, ముఖ్యంగా బాలల సంరక్షణ చట్టం, ఫోక్సో చట్టం, సైబర్ నేరాలు, బాల్య వివాహాలు, బాల కార్మిక నిరోధక చట్టం, భారత రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులు, విధులపై అవగాహన పెంపొందించుకోవాలని ఆమె వివరించారు.
న్యాయపరమైన సమస్యలు ఎదుర్కొంటున్న వారికి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ద్వారా ఉచిత న్యాయ సహాయం అందుబాటులో ఉంటుందని, అవసరమైన వారు కార్యాలయాన్ని సంప్రదించవచ్చని బి. సౌజన్య తెలిపారు. ఈ సదస్సులో కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.












