బాల్కొండ, జూలై 23
బాల్కొండ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో భారత స్వాతంత్ర్య సమరయోధులు బాలగంగాధర తిలక్, చంద్రశేఖర్ ఆజాద్ ల జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు, అధికారులు దేశ స్వాతంత్ర్యానికి వారి చేసిన సేవలను స్మరించుకున్నారు.
బాల్కొండ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో భారత స్వాతంత్ర్య సమరయోధులు బాలగంగాధర తిలక్ మరియు చంద్రశేఖర్ ఆజాద్ (రాజా చంద్రశేఖర్) ల జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు వారి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
దేశం కోసం తిలక్, ఆజాద్ చేసిన పోరాటాలను మండల విద్యాశాఖ అధికారి బట్టు రాజేశ్వర్, సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయులు వేల్పూర్ శ్రీనివాస్, కలిగోట మురళి విద్యార్థులకు వివరించారు. ఈ సందర్భంగా బట్టు రాజేశ్వర్ మాట్లాడుతూ, భారతమాత ముద్దుబిడ్డలైన వీరిని స్మరించుకోవాలని అన్నారు.
"స్వరాజ్యం నా జన్మహక్కు" అనే బాలగంగాధర తిలక్ నినాదాన్ని గుర్తుచేసుకున్నారు. చంద్రశేఖర్ తివారి 1921లో సహాయ నిరాకరణ ఉద్యమంలో పాల్గొన్నందుకు బ్రిటిష్ పోలీసులు అరెస్టు చేశారని తెలిపారు. న్యాయమూర్తి పేరు అడగగా, "నా పేరు ఆజాద్ (స్వేచ్ఛ), నా తండ్రి పేరు స్వతంత్రత, నా చిరునామా జైలు" అని చెప్పిన ఆజాద్ వీరత్వాన్ని కొనియాడారు.
ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.












