సంగారెడ్డి జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య విద్యార్థుల సమగ్ర అభివృద్ధిలో తల్లిదండ్రుల భాగస్వామ్యం అత్యంత కీలకమని, వారి చదువుపై శ్రద్ధ వహించడం భవిష్యత్తుకు పునాది అని పేర్కొన్నారు.
ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా జరిగిన సంక్షేమ వారోత్సవాలలో భాగంగా, సంగారెడ్డిలోని మహాత్మ జ్యోతిబా పూలే తెలంగాణ బీసీ సంక్షేమ గురుకుల పాఠశాల (బాలికలు) జోగిపేటలో కలెక్టర్ తల్లిదండ్రుల సమావేశానికి హాజరయ్యారు. పాఠశాల పరిసరాలను, తరగతి గదులను పరిశీలించి, విద్యార్థులతో నేరుగా మాట్లాడి వారి విద్యా ప్రగతి, సౌకర్యాలపై వివరాలు తెలుసుకున్నారు.
పాఠశాల అభివృద్ధికి తల్లిదండ్రులు తమ సూచనలు, సలహాలు అందించాలని, సమస్యలుంటే వెంటనే ఉపాధ్యాయుల దృష్టికి తీసుకురావాలని కలెక్టర్ కోరారు. అవసరమైతే కంప్లైంట్ బాక్సులు ఏర్పాటు చేసి, సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. విద్యార్థులలో ఇంగ్లీష్ భాషా నైపుణ్యం పెంపొందించేందుకు హాస్టల్లో ప్రతిరోజూ ఒక గంటపాటు ఇంగ్లీష్‌లోనే మాట్లాడే విధానాన్ని అమలు చేయాలని ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులకు ఆదేశించారు.
ప్రతి విద్యార్థి సామర్థ్యాన్ని గుర్తించి, బలహీనంగా ఉన్న సబ్జెక్టులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టడంతో పాటు, ఆసక్తి ఉన్న రంగాలలో ప్రోత్సహించాలని సూచించారు. ప్రభుత్వం సంక్షేమ వసతి గృహాలలో విద్యార్థులకు అవసరమైన అన్ని వసతులు, నాణ్యమైన విద్య, పౌష్టికాహారం అందిస్తోందని, విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణకు రెగ్యులర్ హెల్త్ చెకప్‌లు నిర్వహిస్తున్నట్లు వివరించారు.
ప్రతి నెల నిర్వహించే పేరెంట్స్ మీటింగ్‌కు తల్లిదండ్రులు హాజరై, పిల్లలతో కలిసి ఒక పూట భోజనం చేసేలా ఆదేశాలు జారీ చేయనున్నట్లు వెల్లడించారు. విద్యార్థులలో పెరుగుతున్న మానసిక, భావోద్వేగ సమస్యలను దృష్టిలో ఉంచుకుని తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కలిసి వారికి మానసిక ధైర్యం అందించాలని సూచించారు. అనంతరం 2025-26 విద్యా సంవత్సరంలో వివిధ తరగతుల్లో ర్యాంకులు సాధించిన విద్యార్థులకు కలెక్టర్ చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. తల్లిదండ్రులు కూడా వసతి గృహాలలో అందుతున్న సౌకర్యాలపై సంతృప్తి వ్యక్తం చేశారు.











