మేడ్చల్–మల్కాజ్గిరి జిల్లా కలెక్టర్ మను చౌదరి ఘట్కేసర్ లోని తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఫైన్ ఆర్ట్స్ స్కూల్‌ను ఆకస్మికంగా సందర్శించి, విద్యార్థుల కళా నైపుణ్యాలను ప్రోత్సహించేందుకు ప్రత్యేక వెబ్సైట్ ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.
కలెక్టర్ పాఠశాలలోని కూచిపూడి, గిటారు, కీబోర్డు, పెయింటింగ్ వంటి వివిధ విభాగాలను పరిశీలించారు. విద్యార్థులు రూపొందించిన పెయింటింగ్స్‌ను ఆన్లైన్లో ప్రదర్శించడానికి, వాటిని కొనుగోలు చేయడానికి వీలుగా ఒక ప్రత్యేక వెబ్‌సైట్‌ను అభివృద్ధి చేయాలని సూచించారు. ఇది విద్యార్థులకు అదనపు ప్రోత్సాహాన్ని అందిస్తుందని ఆమె పేర్కొన్నారు.
ప్రభుత్వ కార్యక్రమాలలో విద్యార్థుల సంగీత ప్రదర్శనలకు అవకాశాలు కల్పించాలని, తద్వారా వారి ప్రతిభకు గుర్తింపు లభిస్తుందని కలెక్టర్ తెలిపారు. విద్యార్థుల కళా రంగంలోనే కాకుండా, క్రీడలలో కూడా ప్రోత్సహించాలని సూచించారు.
విద్యార్థులతో కలిసి భోజనం చేసిన కలెక్టర్, పాఠశాలలో నాణ్యమైన, పౌష్టికాహారం అందించాలని అధికారులను ఆదేశించారు. స్టోర్ రూమ్‌ను తనిఖీ చేసి, వంట సామాగ్రి నాణ్యతను స్వయంగా పరిశీలించారు.
విద్యార్థుల కోరిక మేరకు ఫుట్‌బాల్, చెస్, వాలీబాల్ వంటి క్రీడా సామాగ్రిని, ఆర్ట్స్ పరికరాలను వెంటనే సమకూర్చాలని పాఠశాల యాజమాన్యాన్ని ఆదేశించారు. దీనికి సంబంధించిన ప్రతిపాదనలను పంపాలని సూచించారు.

