కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేటలోని కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయంలో మంగళవారం పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్రేమ మోసాలు, మైనర్లపై అఘాయిత్యాలు, సైబర్ నేరాలపై విద్యార్థినులకు పోలీసులు సూచనలు అందించారు.
జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఎం. రాజేష్ చంద్ర ఐపీఎస్ ఆదేశాల మేరకు నాగిరెడ్డిపేట సబ్ఇన్స్పెక్టర్ భార్గవ్ గౌడ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా విద్యార్థినులకు ప్రేమ మోసాలు, మైనర్లపై జరుగుతున్న అఘాయిత్యాలు, సైబర్ నేరాలు, సోషల్ మీడియా వినియోగంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు వంటి వివిధ సామాజిక అంశాలపై పోలీసులు వివరించారు.
వేసవి కాలంలో ఆరోగ్య పరిరక్షణ కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కూడా అవగాహన కల్పించారు. విద్యార్థినులకు షీ టీమ్ హెల్ప్‌లైన్ నంబర్ 8712686094, సైబర్ నేరాల టోల్ ఫ్రీ నంబర్ 1930, అత్యవసర పరిస్థితుల్లో డయల్ 100 కు కాల్ చేయాలని సూచించారు.
సోషల్ మీడియా వేదికలు అయిన ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ వంటివి ఉపయోగించేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని, చదువుపై దృష్టి సారించాలని, చిన్న పొరపాట్లు జీవితాలను ప్రభావితం చేస్తాయని పోలీసులు సూచించారు.
పోలీస్ కళాబృందం ఇన్చార్జి హెడ్ కానిస్టేబుల్ రామంచ తిరుపతి, హెడ్ కానిస్టేబుల్ యు. శేషరావు, పీసీ సాయిలు మాటలు, పాటల ద్వారా విద్యార్థినుల్లో చైతన్యం కల్పించారు. కార్యక్రమంలో ఏహెచ్‌టీయూ పీసీ రాజేందర్, షీ టీమ్ డబ్ల్యూపీసీ సుప్రజ, పీసీ శ్రీశైలం, కేజీబీవీ స్పెషల్ ఆఫీసర్ గీత, ఉపాధ్యాయ బృందం మరియు విద్యార్థినులు పాల్గొన్నారు.

