కామారెడ్డి జిల్లాలో రోడ్డు భద్రత మరియు మాదకద్రవ్యాల వినియోగాన్ని అరికట్టేందుకు విద్యార్థుల్లో అవగాహన కల్పించడం అత్యంత ఆవశ్యకమని రవాణా శాఖ అధికారులు తెలిపారు. జిల్లా రవాణా అధికారి జె. శ్రీనివాస్ ఆదేశాల మేరకు టెక్రియల్లోని కస్తూర్బ గాంధీ బాలికల పాఠశాలలో ఈ మేరకు ఒక అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
పాఠశాల ప్రిన్సిపాల్ లావణ్య ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో రవాణా శాఖ అధికారులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. సహాయక మోటార్ వెహికల్స్ ఇన్స్పెక్టర్లు ఎస్కే. మహమ్మద్ రఫీ, మహమ్మద్ ఇర్షద్ అలీ విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు.
రహదారులపై నిర్లక్ష్యంగా వాహనాలు నడపడం వల్లే ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయని అధికారులు పేర్కొన్నారు. ట్రాఫిక్ నిబంధనలను ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలని, 18 సంవత్సరాల లోపు వారు వాహనాలు నడపరాదని, అలాగే ట్రిపుల్ రైడింగ్ వంటి ప్రమాదకర అలవాట్లను మానుకోవాలని సూచించారు. ఇంట్లో కుటుంబ సభ్యులతో కూడా రోడ్డు భద్రతపై చర్చించి అవగాహన పెంచాలని కోరారు.
మాదకద్రవ్యాల వినియోగం యువత భవిష్యత్తును నాశనం చేస్తుందని, వాటికి దూరంగా ఉండి ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణంలో భాగస్వాములు కావాలని రఫీ విద్యార్థులకు సూచించారు. ఎక్కడైనా మాదకద్రవ్యాల వినియోగం లేదా విక్రయాలు జరుగుతున్నట్లు తెలిసిన వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వాలని ఆయన కోరారు.








