ఈ నెల 3వ తేదీన జరగనున్న నీట్ పరీక్షను ప్రశాంతంగా నిర్వహించేందుకు జిల్లాలో 12 కేంద్రాలను ఏర్పాటు చేసి, అన్ని ఏర్పాట్లను పూర్తి చేసినట్లు జిల్లా అదనపు కలెక్టర్ విజయేందర్ రెడ్డి తెలిపారు.
జిల్లా అదనపు కలెక్టర్ విజయేందర్ రెడ్డి అధ్యక్షతన మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జరిగిన సమీక్షా సమావేశంలో నీట్ పరీక్ష నిర్వహణపై అధికారులకు పలు సూచనలు చేశారు. జిల్లా వ్యాప్తంగా 12 పరీక్షా కేంద్రాలు సిద్ధం చేశామని, మొత్తం 3,468 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరవుతారని ఆయన తెలిపారు.
పరీక్ష మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరుగుతుందని, అభ్యర్థులు నిర్ణీత సమయానికి ముందే కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. హాల్ టికెట్‌లోని నిబంధనలను తప్పక పాటించాలని స్పష్టం చేశారు. పరీక్షా కేంద్రాల వద్ద ఎలాంటి అసౌకర్యం కలగకుండా అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.
కేంద్రాల్లో నిరంతర విద్యుత్ సరఫరా, తాగునీటి వసతి కల్పించాలని, పోలీస్ బందోబస్తు పకడ్బందీగా ఉండేలా చర్యలు తీసుకోవాలని పోలీస్ అధికారులను ఆదేశించారు. వైద్య శాఖ అధికారులు మెడికల్ కిట్లు, అంబులెన్స్‌లను అందుబాటులో ఉంచాలని, దివ్యాంగ విద్యార్థులకు అవసరమైన ప్రత్యేక సౌకర్యాలను సిద్ధం చేయాలని డీడబ్ల్యూఓ అధికారులకు సూచించారు.
ఈ సమీక్షా సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి చంద్రావతితో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.











