రాష్ట్రంలో ప్రభుత్వ విద్యావ్యవస్థ, ముఖ్యంగా పూర్వ ప్రాథమిక విద్య బలహీనపడుతోందని, భవిష్యత్తులో కాంట్రాక్ట్ పద్ధతిలో ఉపాధ్యాయుల నియామకాలపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయని ప్రైమరీ టీచర్స్ అసోసియేషన్ తెలంగాణ (PTA-TG) అధ్యక్షుడు కె. మల్లికార్జున్ రెడ్డి ఆరోపించారు.
ప్రభుత్వ విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి, విద్యా సలహాదారు కె. కేశవరావు చేసిన వ్యాఖ్యలు ఉపాధ్యాయ వర్గాల్లో ఆందోళన రేకెత్తించాయని మల్లికార్జున్ రెడ్డి తెలిపారు. భవిష్యత్తులో ఉపాధ్యాయ నియామకాలు కాంట్రాక్ట్ పద్ధతిలో, మార్కెట్ రేట్లకు అనుగుణంగా జీతాలతో చేపట్టాలనే ప్రతిపాదన ప్రభుత్వ విద్యను నిర్వీర్యం చేస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.
ఇప్పటికే ఉన్నత వర్గాలు ఉపాధ్యాయ వృత్తిని అంతగా ఆసక్తి చూపడం లేదని, ఇలాంటి తరుణంలో కాంట్రాక్ట్ విధానం అమలు చేస్తే పేద, ఆర్థికంగా వెనుకబడిన వర్గాల యువతకు ఉపాధి అవకాశాలు మరింత తగ్గిపోతాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. DiET, TTC కోర్సులను తొలగిస్తే గ్రామీణ, పేద వర్గాల విద్యార్థులు ఉపాధ్యాయ వృత్తిలోకి రావడం కష్టమవుతుందని, డిగ్రీతో పాటు B.Ed చేయడం ఆర్థికంగా భారమవుతుందని తెలిపారు.
మూడు సంవత్సరాల పిల్లలకు విద్య అవసరం లేదన్న వ్యాఖ్యలు సామాజిక అసమానతలను పెంచుతాయని విమర్శించారు. జాతీయ విద్యా విధానం (NEP-2020) ప్రకారం మూడు సంవత్సరాల నుంచే విద్య ప్రారంభించాలనే సూచనలు ఉన్నా, రాష్ట్రంలో అలాంటి అవకాశాలను నిరాకరించడం సరైనది కాదని అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ తరగతులను ప్రారంభించే ప్రతిపాదన నేపథ్యంలో పూర్వ ప్రాథమిక విద్యను బలోపేతం చేయాలని సూచించారు.
ప్రభుత్వ విద్యను రక్షించేందుకు ఉపాధ్యాయ సంఘాలు, నిరుద్యోగ యువత, మేధావులు, ప్రజా సంఘాలు, జర్నలిస్టులు, ప్రజాప్రతినిధులు ముందుకు రావాలని మల్లికార్జున్ రెడ్డి పిలుపునిచ్చారు. కాంట్రాక్ట్ ఉపాధ్యాయ నియామకాలు లేకుండా ప్రభుత్వ విద్యను బలోపేతం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.

