హల్లెల్ మ్యూజిక్ స్కూల్ ఆధ్వర్యంలో నిర్వహించిన గిన్నిస్ వరల్డ్ రికార్డ్ కార్యక్రమంలో సంగారెడ్డికి చెందిన వైద్యురాలు డా. పి. అక్షిత ప్రియ తన ప్రతిభను చాటుకున్నారు. 22 దేశాలకు చెందిన 2,000 మంది కీబోర్డ్ వాయిద్యకారుల సమూహంలో ఆమె ఒకరిగా రికార్డు సాధించారు.
హైదరాబాద్లోని విక్టరీ ఆడిటోరియంలో జరిగిన ఈ కార్యక్రమంలో, 2,000 మంది కీబోర్డ్ వాయిద్యకారులు గంటపాటు నిరంతరాయంగా కీబోర్డ్ వాయించి గిన్నిస్ వరల్డ్ రికార్డును నెలకొల్పారు. వీరిలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన 777 మందిని రికార్డు కోసం ఎంపిక చేశారు. ఈ ఎంపికైన వారిలో డా. అక్షిత ప్రియ ఒకరు.
వైద్యురాలిగా సేవలందిస్తున్న డా. అక్షిత ప్రియ, తన వృత్తిపరమైన బాధ్యతలతో పాటు సంగీత సాధనను కొనసాగించడం విశేషం. ఆమె ఈ అరుదైన ఘనత సాధించడం యువతకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తుంది. ఆమె తల్లిదండ్రులు శ్రీ పల్లికొన జాన్ పాల్, రాహేలమ్మ కూడా ఈ విజయం పట్ల సంతోషం వ్యక్తం చేశారు.
హల్లెల్ మ్యూజిక్ స్కూల్ వ్యవస్థాపకుడు అగస్టిన్ దండింగి, రికార్డు సాధించిన ప్రతిభావంతులకు సర్టిఫికేట్లు అందజేసి అభినందించారు. ఈ సంస్థ గత 15 సంవత్సరాలుగా వేలాది మందికి సంగీత విద్యను అందిస్తూ సమాజ సేవలో కూడా తనదైన ముద్ర వేసింది.
డా. అక్షిత ప్రియ సాధించిన ఈ విజయంపై సంగారెడ్డి పట్టణ ప్రముఖులు, ఉపాధ్యాయులు, వైద్య మిత్రులు ఆమెను, వారి తల్లిదండ్రులను ప్రత్యేకంగా అభినందించారు. ఆమె వైద్య వృత్తితో పాటు సంగీతంలో కూడా రాణించడం అభినందనీయం.








