నిజామాబాద్, జూలై 12
ఉపాధ్యాయులు, విద్యారంగం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోరుతూ తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (టీపీయూఎస్) ఇందూరు జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 14వ తేదీ ఉదయం 10 గంటలకు నిజామాబాద్ జిల్లా కలెక్టరేట్ ఎదుట భారీ ధర్నా నిర్వహించనున్నారు. ప్రభుత్వం ఎన్నికల హామీల అమలులో జాప్యం చేస్తోందని సంఘం నాయకులు ఆరోపిస్తున్నారు.
ఉపాధ్యాయులు, విద్యారంగం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 14వ తేదీ ఉదయం 10 గంటలకు నిజామాబాద్ జిల్లా కలెక్టరేట్ ఎదుట భారీ ధర్నా నిర్వహించనున్నట్లు తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (టీపీయూఎస్) ఇందూరు జిల్లా శాఖ ప్రకటించింది.
ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా ఉపాధ్యాయులకు ఇచ్చిన హామీల అమలులో తీవ్ర జాప్యం జరుగుతోందని సంఘం నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. ఉపాధ్యాయులు, విద్యార్థులు, ప్రభుత్వ పాఠశాలలకు సంబంధించిన పలు సమస్యలు ఇప్పటికీ పరిష్కారం కాకపోవడంతో నిరసన కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు తెలిపారు.
ధర్నాలో ప్రధానంగా పీఆర్సీ నివేదికను వెంటనే ప్రకటించి 51 శాతం ఫిట్మెంట్ అమలు చేయడం, పెండింగ్‌లో ఉన్న ఆరు డీఏలను విడుదల చేయడం, సీపీఎస్‌ను రద్దు చేసి ఓపీఎస్‌ను అమలు చేయడం, 2003 డీఎస్సీ ఉపాధ్యాయులకు ఓపీఎస్ వర్తింపజేయడం, 2010 డీఎస్సీతో పాటు ఇన్‌సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ మినహాయింపు కల్పించడం వంటి డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లనున్నారు.
అలాగే జీఓ–190 అమలు, జీఓ–25 సవరణతో డీఎస్సీ–2025లో తగిన సంఖ్యలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీ, జీహెచ్ఎం సహా అన్ని పదోన్నతులు, బదిలీల పూర్తి, పెండింగ్ సర్వీస్ బెనిఫిట్స్ అమలు, ఎస్ఎస్ఏ, కేజీబీవీ ఉద్యోగుల వేతన బకాయిలు, సేవా ప్రయోజనాల పరిష్కారం, ప్రభుత్వ పాఠశాలల్లో ఖాళీ పోస్టుల భర్తీ, మోడల్ స్కూల్ ఉపాధ్యాయులకు 010 పే స్కేల్ అమలు, పాఠశాలలకు పెండింగ్ గ్రాంట్ల విడుదల, విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, యూనిఫాంలు, మౌలిక సదుపాయాల కల్పన, రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లో అల్పాహార పథకం అమలు చేయాలని డిమాండ్ చేయనున్నారు.
జిల్లాలోని ఉపాధ్యాయులు అధిక సంఖ్యలో హాజరై ధర్నాను విజయవంతం చేయాలని టీపీయూఎస్ జిల్లా అధ్యక్షుడు నల్ల కిషన్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి ,డింగరి మధుసూదనాచారి విజ్ఞప్తి చేశారు.











