పారామెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ అసోసియేషన్ తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో నిమ్స్ హాస్పిటల్ సూపరిండెంట్ ఎన్. సత్యనారాయణను కలిసి, ఇటీవల విడుదలైన టీమ్స్ నోటిఫికేషన్లో ఎంఎల్టి, డిఎంఎల్టి కోర్సులు చేసిన విద్యార్థులకు కూడా అవకాశాలు కల్పించాలని వినతి పత్రం అందించారు.
అసోసియేషన్ ప్రతినిధులు తెలిపిన వివరాల ప్రకారం, ప్రస్తుతం విడుదలైన నోటిఫికేషన్లో కేవలం బిఎస్సి ఎంఎల్టి విద్యార్థులకు మాత్రమే అవకాశం కల్పించడం వల్ల రాష్ట్రంలోని వేలాది మంది విద్యార్థులు నష్టపోతున్నారని పేర్కొన్నారు. వీరిలో చాలామంది పేద, మధ్యతరగతి వర్గాలకు చెందినవారని, కొందరు కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ పద్ధతుల్లో చాలా సంవత్సరాలుగా సేవలు అందిస్తున్నారని తెలిపారు.
ఈ నేపథ్యంలో, ఎంఎల్టి, డిఎంఎల్టి అర్హత కలిగిన విద్యార్థులందరికీ నోటిఫికేషన్లో అవకాశాలు కల్పించాలని వారు సూపరిండెంట్ దృష్టికి తీసుకెళ్లి చర్చించారు. ఈ సమస్యపై సానుకూలంగా స్పందించిన సూపరిండెంట్, పై అధికారుల దృష్టికి ఈ విషయాన్ని తీసుకువెళ్లి, సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చినట్లు అసోసియేషన్ వర్గాలు తెలిపాయి.
ఈ వినతి కార్యక్రమంలో అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు వీరయ్య, ప్రధాన కార్యదర్శి అజయ్, రాష్ట్ర కోఆర్డినేటర్ తలారి ప్రవీణ్, నాయకులు రామ్మూర్తి, రాజు, రామకృష్ణ, టిడిఏ అసోసియేషన్ నుంచి మధువన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సమస్య పరిష్కారంపై విద్యార్థులు ఆశలు పెట్టుకున్నారు.












