మాదక ద్రవ్యాల వినియోగం, నిర్మూలన, అక్రమ రవాణా నియంత్రణ మరియు వ్యక్తిత్వ వికాసంపై ఇన్స్పేర్ సొసైటీ ఫర్ రూరల్ డెవలప్మెంట్ (ఐ.ఎస్.ఆర్.డి) మరియు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ (డి.ఎల్.ఎస్.ఏ) సంయుక్త ఆధ్వర్యంలో సదాశివనగర్ మండల కేంద్రంలోని తెలంగాణ ప్రభుత్వ ఆదర్శ పాఠశాలలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా న్యాయమూర్తి డా. వి.ఆర్.ఆర్. వరప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
జిల్లా న్యాయమూర్తి డా. వి.ఆర్.ఆర్. వరప్రసాద్ మాట్లాడుతూ, మాదక ద్రవ్యాల వ్యసనం వ్యక్తుల జీవితాలను, కుటుంబాలను, సమాజాన్ని తీవ్రంగా దెబ్బతీసే సామాజిక సమస్య అని, దీని నిర్మూలన ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. మాదక ద్రవ్యాల అక్రమ రవాణా దేశ భద్రత, యువత భవిష్యత్తుకు ముప్పుగా పరిణమిస్తోందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
మాదక ద్రవ్యాల వినియోగం వల్ల ఆరోగ్య సమస్యలతో పాటు నేర ప్రవర్తన, ఆర్థిక ఇబ్బందులు, విద్యా ప్రగతిపై ప్రతికూల ప్రభావాలు ఏర్పడతాయని, దేశ అభివృద్ధికి ఇది అడ్డంకిగా మారుతోందని పేర్కొన్నారు. దీనిని అరికట్టేందుకు ప్రభుత్వం, విద్యాసంస్థలు, తల్లిదండ్రులు, స్వచ్ఛంద సంస్థలు సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉందని అన్నారు. విద్యార్థులు తమ లక్ష్యాలపై దృష్టి సారించి విద్య, క్రీడలు, కళల్లో పాల్గొనాలని సూచించారు.
ఐ.ఎస్.ఆర్.డి అధ్యక్షులు సోలంకి రవళి మాట్లాడుతూ, తాత్కాలిక ఆనందాల కోసం ఉజ్వల భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని సూచించారు. తల్లిదండ్రులు పిల్లల ప్రవర్తనపై నిఘా ఉంచి, వారి సమస్యలను అర్థం చేసుకుని మార్గనిర్దేశం చేయాలని కోరారు. ఎక్సైజ్ సూపరింటెండెంట్ హనుమంత రావు యువత తమ సమయాన్ని విద్య, క్రీడలు, వ్యక్తిత్వ వికాసం, సమాజ సేవా కార్యక్రమాల వైపు మళ్లించాలని పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా విద్యార్థులకు మాదక ద్రవ్యాల వల్ల కలిగే దుష్పరిణామాలు, చట్టపరమైన అంశాలపై అవగాహన కల్పించారు. అనంతరం విద్యార్థులచే “మాదక ద్రవ్యాలకు దూరంగా ఉంటాం, ఇతరులను కూడా దూరంగా ఉండేలా చైతన్యం కల్పిస్తాం” అనే ప్రతిజ్ఞ చేయించారు. “డ్రగ్-ఫ్రీ యూత్ – డ్రగ్-ఫ్రీ నేషన్” లక్ష్య సాధనలో భాగస్వాములు కావాలని కోరారు.












