భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) నిర్వహిస్తున్న యువికా (Young Scientist Programme) కార్యక్రమానికి చిన్న మల్లారెడ్డి బాలుర ఉన్నత పాఠశాల 9వ తరగతి విద్యార్థిని రావుల నిహారిక ఎంపికైంది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఆశీస్ సాంగ్వాన్, విద్యార్థినిని, ఆమె గైడ్ టీచర్ ప్రవీణ్ కుమార్ ను తన కార్యాలయంలో ప్రత్యేకంగా అభినందించారు.
పాఠశాల స్థాయి విద్యార్థుల్లో అంతరిక్ష శాస్త్రంపై ఆసక్తిని పెంపొందించడం, శాస్త్రీయ దృక్పథాన్ని అభివృద్ధి చేయడం యువికా కార్యక్రమం ముఖ్య లక్ష్యమని కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా దేశవ్యాప్తంగా సైన్సులో వినూత్న కార్యక్రమాల్లో పాల్గొన్న విద్యార్థులను ఎంపిక చేస్తారు.
ఎంపికైన విద్యార్థులకు ఇస్రో శిక్షణ కేంద్రాల్లో అంతరిక్ష విజ్ఞానం, ఉపగ్రహాల నిర్మాణం, రాకెట్ల పని విధానం, భౌతిక, రసాయన, గణిత శాస్త్రాలపై ప్రాయోగిక, సైద్ధాంతిక శిక్షణ ఇవ్వబడుతుంది. ప్రయోగశాల సందర్శనలు, శాస్త్రవేత్తలతో ముఖాముఖి వంటి కార్యక్రమాలు కూడా ఉంటాయి.
ఈ సంవత్సరం యువికా కార్యక్రమానికి ఎంపిక ప్రక్రియలో విద్యార్థుల ప్రతిభ, విద్యార్హతలు, సైన్స్‌పై ఆసక్తి, ఆన్లైన్ పరీక్షలో సాధించిన మార్కులను పరిగణలోకి తీసుకున్నారు. అధికారిక వెబ్సైట్ ద్వారా స్వీకరించిన దరఖాస్తుల ఆధారంగా మెరిట్ లిస్టును రూపొందించారు. ఒక గ్రామీణ ప్రాంత విద్యార్థినికి ఇస్రోలో జరుగుతున్న పరిశోధనలు, ప్రయోగాలను తెలుసుకోవడం, శాస్త్రవేత్తలతో ప్రత్యక్షంగా కలుసుకునే అవకాశం దక్కడం అభినందనీయమని కలెక్టర్ పేర్కొన్నారు. ఈ అవకాశం నిహారిక భవిష్యత్తులో శాస్త్రవేత్తగా లేదా ఇంజనీర్‌గా ఎదగడానికి తొలి మెట్టుగా నిలుస్తుందని, ఇది ఇతర విద్యార్థులకు కూడా ప్రేరణగా ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.











