భారతీయ సినీ చరిత్రలో ఫాంటసీ మరియు కథన శైలికి కొత్త నిర్వచనం ఇచ్చిన 'పాతాళ భైరవి' చిత్రం తన 75వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటుంది. సుప్రసిద్ధ విజయా ప్రొడక్షన్స్ సంస్థ నుంచి వెలువడిన ఈ చిత్రం, తెలుగు సినీ చరిత్రలో ఒక ఆణిముత్యంగా నిలిచింది.
దర్శకుడు కె. వి. రెడ్డి దర్శకత్వ ప్రతిభ, నందమూరి తారక రామారావు హీరోగా, ఎస్. వి. రంగారావు ప్రతినాయకుడిగా అద్భుత నటన, మరియు చిత్రంలోని చిరస్మరణీయ సంభాషణలు కలిసి తరతరాల్ని దాటి తెలుగు ప్రజాసంస్కృతిలో శాశ్వత స్థానం సంపాదించాయి. ఈ చిత్రం ఇప్పటికీ ప్రేక్షకులను అలరిస్తూనే ఉంది.
1951 మార్చి 15న విడుదలైన ఈ చిత్రం తెలుగు మరియు తమిళ భాషల్లో ఒకేసారి చిత్రీకరించబడింది. అనంతరం 1952లో హిందీ వెర్షన్ విడుదల చేయబడింది. దక్షిణ భారత సినీ చరిత్రలో బహుభాషా నిర్మాణానికి ఈ చిత్రం తొలి ఉదాహరణల్లో ఒకటిగా నిలిచింది.
ఈ చిత్ర కథకు ప్రేరణ ప్రధానంగా ప్రసిద్ధ తెలుగు సాహిత్య గ్రంథమైన “కాశీ మజిలీ కథలు” నుంచి అంకురార్పన జరిగింది. ఈ స్థానిక సాంస్కృతిక మూలాలు ప్రేక్షకుల మనసులను లోతుగా తాకాయి. ఈ చిత్రంలోని వినూత్న కథనం మరియు సాంకేతిక ప్రతిభ కలిసి తెలుగు సినిమాలలో జానపద ఫాంటసీ శైలికి బలమైన పునాది వేశాయి.
షావుకారు చిత్రం విజయం తర్వాత, నిర్మాతలు బి. నాగిరెడ్డి మరియు అలూరి చక్రపాణి ఒక గొప్ప జానపద ఫాంటసీ చిత్రాన్ని నిర్మించాలని నిర్ణయించుకున్నారు. దర్శకుడు కె. వి. రెడ్డికి ఈ బాధ్యతను అప్పగించారు. ఈ విధంగా విజయా సంస్థ ఫాంటసీ జానర్లో భారీ పెట్టుబడి పెట్టింది.











