పర్యావరణ పరిరక్షణలో భాగంగా వనమహోత్సవం–2026 కార్యక్రమాన్ని కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ప్రారంభించారు. మొక్కలు నాటడం, వాటిని సంరక్షించడం ద్వారా భవిష్యత్ తరాలకు ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించాలని ఆయన పిలుపునిచ్చారు.
గురువారం కామారెడ్డిలోని నర్సనపల్లి అటవీ సముదాయంలో అటవీ శాఖ నూతన భవనాన్ని కలెక్టర్ ప్రారంభించి, మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పెరుగుతున్న కాలుష్యం, వాతావరణ మార్పుల నేపథ్యంలో చెట్ల ప్రాధాన్యం పెరిగిందన్నారు.
ప్రభుత్వ హరిత కార్యక్రమాలకు ప్రజల భాగస్వామ్యం అవసరమని, గ్రామాలు, పట్టణాల్లో విస్తృతంగా మొక్కలు నాటడం ద్వారా పర్యావరణ పరిరక్షణ సాధ్యమవుతుందని తెలిపారు. ప్రతి వ్యక్తి కనీసం ఒక మొక్కను నాటి, బాధ్యతగా సంరక్షిస్తే సమాజానికి విలువైన సేవ చేసిన వారవుతారని కలెక్టర్ అభిప్రాయపడ్డారు.
అటవీ సంపద సంరక్షణతో పాటు పచ్చదనం పెంపుదలకు ప్రజలు ముందుకు రావాలని ఆయన కోరారు. అనంతరం అటవీ శాఖ ఏర్పాటు చేసిన అటవీ సంరక్షణ, జీవ వైవిధ్య పరిరక్షణకు సంబంధించిన ఫోటో ఎగ్జిబిషన్‌ను కలెక్టర్ పరిశీలించారు.
వనమహోత్సవం కార్యక్రమం ద్వారా పర్యావరణ పరిరక్షణపై ప్రజల్లో మరింత అవగాహన పెంపొందుతుందని కలెక్టర్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అటవీ అధికారి నీరజ్ కుమార్ టిబ్రెవాల్ (ఐఎఫ్ఎస్), అటవీ శాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు, విద్యార్థులు, ప్రకృతి ప్రేమికులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.












